ఇరవై ఏళ్ల క్రితం తమిళనాడులోని ఓ ప్రాచీన ఆలయం నుంచి చోరీకి గురై బ్రిటన్కు తరలిపోయిన 13వ శతాబ్దం నాటి రామ, లక్ష్మణ, సీత కాంస్య విగ్రహాలు మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాయి. వాటిని కేంద్ర సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ బుధవారం దిల్లీలోని భారత పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.
తమిళనాడులోని నాగ పట్టణం జిల్లా ఆనందమంగళంలోని విజయనగర రాజుల కాలంలో నిర్మించిన శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయం నుంచి రామ, లక్ష్మణ, సీత విగ్రహాలు చోరీ అయినట్లు గుర్తించిన ఇండియా ప్రైడ్ ప్రాజెక్టు అధికారులు, వాటిని బ్రిటన్కు తరలించి ఉండొచ్చని లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయానికి గతేడాది ఆగస్టులో తెలియజేశారు. దీంతో వారు రంగంలోకి దిగారు. అదృష్టవశాత్తు 1958లో తీసిన ఆ విగ్రహాల ఫొటోలను భద్రపరచటం వల్ల వాటి ఆచూకీని కనిపెట్టడం సాధ్యమైందని ప్రహ్లాద్ తెలిపారు. తమిళనాడు పోలీసు శాఖలోని విగ్రహాల విభాగం పాత రికార్డులను అధ్యయనం చేసి ఆ శిల్పాలు 1978 నవంబర్ 23-24 తేదీల్లో చోరీ అయినట్లు తేల్చారన్నారు. దీంతోపాటు ఆ నేరానికి పాల్పడిన దొంగలనూ పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆధారాలన్నింటినీ లండన్ పోలీసులకు అందజేయడం వల్ల వారు దర్యాప్తు చేపట్టి ప్రస్తుతం ఆ విగ్రహాలను సొంతం చేసుకున్న యజమానిని గుర్తించారని చెప్పారు. అనంతరం ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకుని సెప్టెంబర్ 15న అక్కడి భారత హైకమిషన్ కార్యాలయంలో అప్పగించారు.
విగ్రహాల వెలికితీతలో విశేష కృషి చేసిన భారత పురావస్తు శాఖ, భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు, లండన్ పోలీసులు, తమిళనాడు పోలీసు శాఖకు చెందిన విగ్రహాల విభాగాన్ని ప్రహ్లాద్ అభినందించారు.