ఉత్తర సరిహద్దులో భారత్-చైనా ఉద్రిక్తతలపై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చైనా-భారత్‌లు సైనిక, దౌత్య మార్గాల్లో పరస్పరం సంప్రదించుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రతను కాపాడటానికి భారత్ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు విదేశీ వ్యవహారా శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.. మీడియాతో ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలు కాపాడేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సరిహద్దు నియంత్రణ పట్ల భారత దళాలు బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు
"సరిహద్దులో తలెత్తిన సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి రెండు వైపులా సైనిక, దౌత్య స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా పరస్పరం సంప్రదించుకుంటాం. శాంతిని కాపాడాలనే విషయానికి భారత్ కట్టుబడి ఉంది. ఇరు దేశాల మధ్య కుదిరే ఏకాభిప్రాయాన్ని భద్రతా దళాలు తప్పకుండా అనుసరిస్తాయి."
-శ్రీవాస్తవ, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి