తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై బుధవారం మరోమారు సమావేశమయ్యాయి భారత్, చైనా. ఈ మేరకు ఇరు దేశాల మధ్య దౌత్యస్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో స్థిరత్వం, అసమానతలను తొలిగించటంపై గత సైనిక స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరాన్ని ఇరు దేశాల అధికారులు నొక్కిచెప్పారు.
సరిహద్దు వ్యవహారాలపై 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్'(డబ్ల్యుఎంసీసీ) ఆధ్వర్యంలో.. వర్చువల్‌గా నిర్వహించిన చర్చల అనంతరం ఓ ప్రకటన విడుదల చేసింది భారత విదేశాంగ శాఖ.
"వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితులపై ఇరువర్గాలు సమీక్షించాయి. సీనియర్ కమాండర్ల మధ్య జరిగిన ఆరోదశ చర్చల ఫలితాలపై ఇరువైపుల నుంచి సానుకూల స్పందన లభించింది. సరిహద్దుల్లో స్థిరత్వం, అసమానతలను తొలగించేందుకు 6వ దశ సీనియర్ కమాండర్ స్థాయి చర్చల్లో ప్రస్తావించిన విధానాలను అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాం. ఇరుదేశాల క్షేత్రస్థాయిలోని కమాండర్ల మధ్య కమ్యునికేషన్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నాం. ఎల్ఏసీ వెంబడి అన్ని ఫింగర్ పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఒప్పందాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశాం."
- భారత విదేశాంగ శాఖ.