భారత్-చైనా మధ్య సుదీర్ఘమైన భూసరిహద్దు ఉంది. లద్దాఖ్ నుంచి హిమాచల్‌ప్రదేశ్,ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో సరిహద్దులను కలిగివున్నాయి. పశ్చిమంగా చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్ స్వయంపాలిత ప్రాంతం ఉంది. టిబెట్‌లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తెచ్చుకున్న అనంతరం భారీస్థాయిలో మౌలికసౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా రహదారులు, రైల్వే మార్గాలను నిర్మించారు. 1962లో చైనా మన దేశంపై దాడి చేసి లద్దాఖ్‌కు చెందిన ఆక్సయ్‌చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అంతే కాకుండా అరుణాచల్‌ప్రదేశ్ సైతం తమ దేశానికి చెందిన భాగంగా వాదిస్తోంది.
చైనాను నమ్మలేం..
వాస్తవంగా చైనాతో మన తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్నేహంగా ఉండేవారు. పంచశీల సిద్ధాంతం ఆదర్శమని ప్రకటించిన చైనా ప్రీమియర్ చౌఎన్‌లై ఆ తరువాతి కాలంలో 1962లో భారత్‌పై యుద్ధానికి కాలుదువ్వాడు. అప్పటి నుంచి చైనా మన దేశవ్యతిరేక వైఖరి కొనసాగిస్తోంది. కొంతకాలం క్రితం డోక్లామ్‌లో సైతం ఇరుదేశాల సైన్యాలు సుదీర్ఘకాలం ఎదురెదురుగా నిలిచాయి. తాజాగా మన ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న గల్వాన్‌లోయను ఆక్రమించుకునేందుకు చైనా అనేక ఎత్తుగడలు వేసింది. ఒక వైపు చర్చలు సాగిస్తునే మరో వైపు మనదేశ సైనికులపై పాశవికంగా జరిపిన దాడులు తెలిసిందే. అయితే భారతీయసైనికులు వీరోచితంగా పోరాడి మాతృభూమిని రక్షించారు. వీరిలో కొందరు అమరులయ్యారు.
ఇది 2020 ..1962 కాదు..
చైనా 1962లో భారత్‌పై దాడి చేయడమే కాకుండా ఆక్సయ్‌చిన్‌ను ఆక్రమించుకుంది. అనంతరం 1967లో సిక్కింలోని నాథులా కనుమలో మరో సారి దురాక్రమణకు దిగింది. ఈ పోరులో చైనా విపరీతంగా నష్టపోయింది. చివరకు వారే వెనక్కువెళ్లారు. 1987లోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని సమ్‌దురాంగ్‌ను ఆక్రమించుకునేందుకు బీజింగ్ విఫలయత్నం చేసింది. ఆ సమయంలో జనరల్ సుందర్జీ నేతృత్వంలో ఆపరేషన్ ఫాల్కన్, ఆపరేషన్ చెకర్ బోర్డు కార్యక్రమాలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన చైనీయులు వెంటనే ఆక్రమితప్రాంతాల నుంచి వెనుదిరిగారు. ఆర్థిక రంగంలో ఉదారవాద విధానాలతో చైనా ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. భవిష్యత్తులో అమెరికాను కూడా దాటి అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవనుంది. ఈ సమయంలో భారత్‌తో యుద్ధం వస్తే చైనా తీవ్రంగా నష్టపోవాల్సివుంటుందని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1962 తరువాత భారత్ సైనికంగానూ, ఆర్థికంగానూ బలపడింది. చైనా దగ్గర అణ్వాయుధాలుంటే మన దగ్గరా ఉన్నాయి. చైనాకు దీటుగా బదులివ్వగల సైన్యం, వాయుసేన, నౌకాదళం ఉన్నాయి. క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తే మన కంటే చైనా ఆర్థికంగా నష్టపోనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లోని సైనిక బలగాల కూర్పుపై అమెరికాకు చెందిన బెల్ఫర్‌సెంటర్ అధ్యయనం చేసి ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.