తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2020, 6:42 PM IST

ETV Bharat / bharat

పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దు: కేంద్రం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. పలు ఆంక్షలు విధించింది. ఈనెల 22 నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించింది. 10 ఏళ్లలోపు, 65 ఏళ్లు పైబడిన వారు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.

India bans all
కరోనా నివారణకు కేంద్రం చర్యలు

కరోనాతో దేశంలో నలుగురు మృతి చెందటం, 170కిపైగా కేసులు నమోదైన నేపథ్యంలో కఠిన చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు ఆంక్షలు విధించింది. అదే సమయంలో... ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. పరిస్థితులను బట్టి తగిన చర్యలు తీసుకుంటున్నామని.. దేశంలో సరిపడా ఎన్​-95 మాస్కులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

అంతర్జాతీయ విమానాలు బంద్​..

ఈనెల 22 నుంచి 29 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది కేంద్రం. విద్యార్థులు, రోగులు, దివ్యాంగులు మినహా ఇతరులకు రైళ్లు, విమానాల్లో రాయితీ ప్రయాణాలను రద్దు చేయాలని రైల్వే, పౌర విమానయాన సంస్థలకు ఆదేశించింది.

రాష్ట్రాలకు ఆదేశాలు..

పౌరులందరికీ తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వైద్య నిపుణులు మినహా 65 ఏళ్ల పైబడిన వారు ఇళ్లకే పరిమితం కావాలని నిర్దేశించింది. 10ఏళ్ల లోపు పిల్లలను బయట తిరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. అత్యవసర సర్వీసుల్లో పని చేసే వారు మినహా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసేలా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

షిప్టుల వారీగా..

గ్రూప్‌ బి, సి కేటగిరీల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు షిప్టుల వారీగా వారానికి ఒక సారి మార్చుకుంటూ విధులకు హాజరు కావాలని ఆదేశించింది సిబ్బంది వ్యవహారాల శాఖ.

ABOUT THE AUTHOR

...view details