తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో ఇదివరకు ఉన్న ఓర్పు కనిపించడం లేదు' - నికోలస్ బర్న్స్​తో రాహుల్ వీడియో కాన్ఫరెన్స్

భారత్​-అమెరికా దేశాల్లో ఇదివరకు ఉన్న సహనం ప్రస్తుతం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికా మాజీ దౌత్యవేత్తతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాహుల్... ఇరుదేశాల భాగస్వామ్యం సహనం వల్లే కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

India and US have tolerance streak in their DNA
'భారత్​లో ఇదివరకు ఉన్న ఓర్పు కనిపించడం లేదు'

By

Published : Jun 12, 2020, 1:11 PM IST

Updated : Jun 12, 2020, 1:45 PM IST

ఓర్పు, సహనం అనేవి భారత్, అమెరికా పౌరుల డీఎన్​ఏలో ఉండేవని, అయితే క్రమంగా అవి అదృశ్యమైపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్​తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన... సహనం వల్లే ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతోందన్నారు.

"మన (భారత్-అమెరికా) భాగస్వామ్యం కొనసాగుతోందంటే కారణం.. మన సహనమే అని నా అభిప్రాయం. అమెరికా ఇమ్మిగ్రెంట్ దేశమని మీరు అన్నారు. మాది సహనంతో కూడిన దేశం. మన డీఎన్​ఏ సహనంతో కూడుకొని ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ డీఎన్​ఏ అదృశ్యమవుతోంది. భారత్, అమెరికా దేశాలలో ఇదివరకు ఉన్న ఓర్పు ఇప్పుడు కనిపించడం లేదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఈ విషయంపై మాట్లాడిన నికోలస్ బర్న్స్... సమస్యను స్వీయ దిద్దుబాటుతో పరిష్కరించుకోవడం ఇరు దేశాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. అమెరికాలోని ప్రజలు ప్రస్తుతం మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు.

"అమెరికాలో సానుకూల విషయమేంటంటే.. ప్రజలు ఇతరుల కోసం బయటకు వచ్చి పోరాడుతున్నారు. మైనారిటీల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. చైనాలాంటి నియంతృత్వ దేశాల్లా కాకుండా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంటుంది. భారత్, అమెరికా సహా ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో ఇది చాలా ముఖ్యం. భారత్, అమెరికా డీఎన్ఏలలో స్వీయ-దిద్దుబాటు అనేది ఓ భాగం. మనం హింసాత్మకం వైపు అడుగులు వేయకుండా సమస్యలను న్యాయపరమైన ఎన్నికల విధానం ద్వారా పరిష్కరించుకుంటాం."

-నికోలస్ బర్న్స్, అమెరికా మాజీ దౌత్యవేత్త

గత కొద్ది రోజులుగా ప్రముఖులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. ఇటీవల పారిశ్రమికవేత్త రాహుల్ బజాజ్, వైద్య నిపుణులు ఆశిష్ ఝా వంటి వారితో సంభాషించారు. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుపై ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక వేత్త- నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో చర్చించారు రాహుల్.

Last Updated : Jun 12, 2020, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details