తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అజేయ 'హైపర్'​ ఆయుధాలు భారత్​కు ఉపయోగమేనా?

ఇది హైపర్​సోనిక్​ ఆయుధాల కాలం. మన చుట్టూ ఉన్న దేశాలు ఈ ఆయుధాలను సమకూర్చుకునే పనిలో తీరిక లేకుండా పనిచేస్తున్నాయి. అయితే భారత్ కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా ఉంది. ​రష్యాకు చెందిన అత్యాధునిక ఎస్​-400, అమెరికా నాసామ్స్‌-2 వంటి క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకుంటోంది. వీటి గురించి తెలుసుకుందాం.

In hypersonic arms age
అజేయ 'హైపర్'​ ఆయుధాలు భారత్​కు ఉపయోగమేనా?

By

Published : Feb 18, 2020, 2:56 PM IST

Updated : Mar 1, 2020, 5:43 PM IST

పూర్వం బాణాలు, కత్తులు వంటి ఆయుధాలతో యుద్ధాలు జరిగేవి. తర్వాత తుపాకీ, బాంబులతో పోరాడారు. కాలంతో పాటు యుద్ధం తీరూ మారింది. ఇది అణు బాంబులు, అత్యాధునిక​ ఆయుధాల కాలం. ఇక్కడ ఓ మీట నొక్కితే ప్రపంచ పటంలో ఓ దేశమే నిమిషాల్లో మాయమైపోయేంత శక్తిమంతమైన ఆయుధాల వైపు ప్రపంచం పరుగులు తీస్తోంది.

అలాంటివాటిలో హైపర్​సోనిక్​ ఆయుధాలు ఒకటి. వీటిని అడ్డుకునే శక్తి ఇప్పటివరకూ ఏ వ్యవస్థకూ లేదు. యుద్ధ స్థితిగతులను, రీతినే మార్చగలిగే శక్తి వీటి సొంతం. అందుకే ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు ఈ ఆయుధాల తయారీ, కొనుగోళ్లకు పోటీపడుతున్నాయి.

భారత్​ కూడా...

ఇప్పటికే రష్యా ఈ హైపర్​సోనిక్​ ఆయుధాల తయారీలో ముందుంది. ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశంగా చైనా అవతరించింది. అమెరికా కూడా వీటికి దగ్గరగానే ఉంది. భారత్​ ఇప్పుడిప్పుడే వీటిని సమకూర్చుకుంటోంది. ఫ్రాన్స్​, ఆస్ట్రేలియా, జపాన్​, జర్మనీ దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి.

ఎందుకింత తొందర...?

రష్యా నుంచి ఎస్​-400 క్షిపణి వ్యవస్థ, అమెరికా నుంచి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్) లేదా 'నేషనల్‌ అడ్వాన్స్​డ్​ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ సిస్టమ్‌-2' (నాసామ్స్​-2) కొనుగోలు చేస్తోంది భారత్. అయితే... ఈ కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఎందుకింత తొందరపడుతుందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు వీటి ఖరీదు ఎంత? ప్రత్యేకతలేంటి? చూద్దాం.

ఎస్​-400...

ఎస్​- 400

ఎస్-400ను ప్రపంచంలో అత్యంత సమర్థమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థగా భావిస్తారు. ఇది శత్రువుల క్షిపణి దాడులను అడ్డుకుంటుంది. ఇది ఒకేసారి 36 లక్ష్యాలపై గురిపెట్టగలదు. 400 కి.మీ దూరం, 30 కి.మీ ఎత్తులో ఉన్న డ్రోన్లు, బాంబర్లు, క్షిపణులను ఇది తునాతునకలు చేయగలదు. ఈ వ్యవస్థలను రూ. 40,000 కోట్లు వెచ్చించి రష్యా నుంచి భారత్​ కొనుగోలు చేస్తోంది.

ఐఏడీడబ్ల్యూఎస్​...

నాసామ్స్​-2

ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల 'సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్‌)'ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. రూ.13 వేల కోట్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి.

'హైపర్​సోనిక్​' ప్రత్యేకతలు...

హైపర్​సోనిక్​ గ్లైడ్​ వెహికల్

హైపర్​సోనిక్​ క్షిపణులు ఖండాంతర లక్ష్యాలను ఛేదించగలవు. సంప్రదాయ, అణు వార్​హెడ్లను కలిగిన ఈ క్షిపణులు ఊహించని వేగంతో దూసుకెళ్తూ కచ్చితంగా శత్రువుల్ని మట్టుబెట్టగలవు.

ధ్వని వేగం గంటకు 1,236 కిమీ. దీనినే మాక్​ 1 అంటారు. ఈ వేగాన్ని దాటితే వాటిని 'సూపర్​సోనిక్​' అంటారు. మాక్​ 5ను దాటిన వేగాన్ని 'హైపర్​ సోనిక్'​గా పిలుస్తారు.

అయితే ప్రస్తుతం మాక్​ 20 దాటిన హైపర్​సోనిక్​ క్షిపణులపై అధ్యయనం చేస్తున్నారు. అలాంటి క్షిపణి తయారైతే.. నిమిషంలో అది దిల్లీ నుంచి ఇస్లామాబాద్, అరగంటలో అమెరికాలోని న్యూయార్క్​ చేరుకోగలదు.​

అమెరికా జోరు...

బహిరంగంగా చెప్పకపోయినా హైపర్​సోనిక్​ ఆయుధాల తయారీలో ఇప్పటికే అమెరికా చురుగ్గా ఉంది. అమెరికా సైన్యం, నౌకాదళం, వాయుసేన, రక్షణ పరిశోధన సంస్థలు తమ అవసరాల మేరకు వీటి తయారీలో నిమగ్నమయ్యాయి.

'సూపర్'​ రష్యా...

వ్లాదిమిర్​ పుతిన్​, రష్యా అధ్యక్షుడు

ప్రపంచంలో హైపర్​సోనిక్​ క్షిపణలు కలిగిన ఏకైక దేశంగా ఇప్పటికే రష్యా నిలిచింది. 2019, డిసెంబర్​ 27న అవాన్​గార్డ్​ హైపర్​సోనిక్​ గ్లైడ్​ వెహికల్​(ఏహెచ్​జీవీ)తో కూడిన తొలి వాహనం రష్యా అమ్ములపొదిలోకి చేరింది. రాజధాని మాస్కోలో దీనిని మోహరించారు.

ధాటిగా చైనా...

రిపబ్లిక్​ ఆఫ్​ చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా 2019, అక్టోబర్​ 1న డీఎఫ్‌ 17 హైపర్​సోనిక్​ క్షిపణిని ప్రదర్శించింది. ఇది శబ్దవేగానికి అయిదింతల వేగంతో పయనించే హైపర్‌ సోనిక్‌ గ్లైడ్‌ వాహనం. డీఎఫ్‌ 17 గాలిలో పయనించేటప్పుడు ఇష్టానుసారం దారి మార్చుకుంటూ ప్రత్యర్థులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతుంది.

అయితే అజేయమైన హైపర్​సోనిక్​ క్షిపణులపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, ఎదుర్కొంటున్న ముప్పు నేపథ్యంలో వీటి అవసరం ఉండొచ్చని కొందరి అభిప్రాయం. ప్రస్తుతమున్న వ్యవస్థలకు కాలం చెల్లిన పరిస్థితుల్లో కొత్తవి సమకూర్చుకోవడం ఆవశ్యకమన్నది వారి వాదన. మరికొంతమంది ఇన్ని కోట్లు పెట్టి వీటిని అత్యవసరంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

(రచయిత- సంజీవ్​ బారువా, సీనియర్​ జర్నలిస్ట్​)

Last Updated : Mar 1, 2020, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details