తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉల్లి ధరలు పెరిగితే అందరికీ డర్- 'మహా' నేతలకు మాత్రం ప్యార్! - మహారాష్ట్ర

ఉల్లిధరలు పెరిగితే నిరసనలు వెల్లువెత్తుతాయి. కొన్నిసార్లు అధికార పీఠాలూ కదిలిపోతాయి. దిల్లీ, రాజస్థాన్​ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కానీ... మహారాష్ట్ర మాత్రం ఇందుకు భిన్నం. ఉల్లి ధరలు తగ్గించాలని ఆందోళనలు కాదు కదా... కనీసం డిమాండ్లయినా రావడంలేదు. అందుకు విరుద్ధంగా... ఉల్లి ధరల కట్టడి కోసం కేంద్రం తీసుకున్న చర్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకిలా? మహారాష్ట్రకు మాత్రమే ప్రత్యేకమైన 'ఉల్లి సిద్ధాంతం' ఏంటి?

ఉల్లి ధరలు పెరిగితే అందరికీ డర్- 'మహా' నేతలకు మాత్రం ప్యార్!

By

Published : Oct 4, 2019, 7:01 AM IST

Updated : Oct 4, 2019, 3:22 PM IST

ఉల్లి ధరలు పెరిగితే అందరికీ డర్- 'మహా' నేతలకు మాత్రం ప్యార్!

ఉల్లిపాయలు సహజసిద్ధంగానే మనిషిని ఏడిపించగలవు. వంట చేసేవారినే కాదు.. ప్రజలను పరిపాలించే రాజకీయనేతలను సైతం ఉల్లి కన్నీరు పెట్టించగలదు. అయితే మహారాష్ట్ర నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వారు పెద్దగా ఆందోళన చెందడంలేదు. పైగా వారి అధికారంపై అది ఏ మాత్రం ప్రభావం చూపదని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఉల్లి ధరల విషయంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది.

దిల్లీలో భాజపాకు ఉల్లిదెబ్బ

1998లో దేశ రాజధాని దిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కంపించేలా చేశాయి ఉల్లి ధరలు. కిలో రూ.45 నుంచి 50 వరకు పలుకుతున్న ఆ రోజుల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సరికొత్త వ్యూహం రచించింది భాజపా. శాసనసభ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి సాహిబ్​ సింగ్​ వర్మను దింపి.. సుష్మా స్వరాజ్​కు సీఎం పగ్గాలు అప్పజెప్పింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉల్లి ధరలు సామాన్యునికి అందనంత ఎత్తున నిలిచినందున ఎన్నికల్లో భాజపాకు పరాజయం తప్పలేదు.

కాంగ్రెస్​కూ తప్పలేదు..

1998 నుంచి 2013 వరకు దిల్లీ పీఠంపై ఏకచ్ఛత్రాధిపత్యాన్ని సాగించిన కాంగ్రెస్​ పాలనకు సైతం చెక్​ పెట్టింది ఉల్లి ధర. దేశ రాజధానిలో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ హయాంలో కిలో 100 రూపాయలు వరకు వెళ్లింది. ఫలితంగా కాంగ్రెస్​ అధికారాన్ని కోల్పోయింది. అదే ఏడాది రాజస్థాన్​లోనూ ఇదే అనుభవం ఎదురై ముఖ్యమంత్రి పీఠాన్ని చేజార్చుకుంది హస్తం పార్టీ.

మహారాష్ట్రలో పరిస్థితి భిన్నం

దిల్లీ, రాజస్థాన్ నేర్పిన పాఠాల కారణంగా రాజకీయ నాయకులు అందరూ ఉల్లి ధరలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. అయితే మహారాష్ట్ర నేతలు మాత్రం ఇందుకు భిన్నం. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నప్పటికీ.. అక్కడి ప్రభుత్వం ఉల్లి ధరల పెరుగుదలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలోనూ గత నెలరోజులుగా ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతేడాదిలో ఇదే సమయానికి కిలో రూ.10 ఉంటే ప్రస్తుతం 50 రూపాయలు ఉంది.
మహారాష్ట్ర నాసిక్​ జిల్లాలోని 'లాసల్గావ్​' మార్కెట్​.. అసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్​గా ప్రసిద్ధి. అయితే గత నెల 20న ఇదే మార్కెట్​లో క్వింటాల్​ ఉల్లి ధర రూ.5100 పలికింది. ఫలితంగా కిలో ఉల్లి రూ.70 నుంచి 80 రూపాయలకు చేరింది. అయినా... దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వం మాత్రం ధరల నియంత్రణపై శ్రద్ధ వహించటం లేదు. అక్కడి ప్రతిపక్ష నాయకుడు శరద్​ పవార్​ కూడా ఉల్లి ధరల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం మరో విశేషం.
అయితే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించినందున ప్రస్తుతం ఉల్లి ధరలు స్థిరంగా ఉన్నాయి.

అందుకే విమర్శించట్లేదా?

పదేళ్ల క్రితం శరద్​ పవార్​ కేంద్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు.. మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. ఉల్లి, చక్కెర, పప్పు దినుసులు సహా చాలా వరకు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న భాజపా, శివసేన... ధరల పెరుగుదలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. అయితే ప్రతిపక్షాల ఆందోళనలను పవార్​ కొట్టిపారేశారు. ధరలు పెరిగినందునే రైతులకు కొంత లాభం వస్తోందని ఎదురుదాడి చేశారు. దీనిపై ఎవరూ వాదించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత కూడా అలాంటి పరిస్థితులు చాలానే ఎదురైనప్పటికీ ఆయన అధికారానికి ఏ ఢోకా రాలేదు. 2013లో ఉల్లిధరలు విపరీతంగా పెరిగి కిలో 100 రూపాయలకు చేరుకున్నప్పటికీ ఎగుమతులపై నిషేధం విధించేందుకు పవార్​ నిరాకరించారు.

యాదృచ్ఛికంగా 2010లో ఇలాగే చక్కెర ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంపై నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ ప్రతినిధి ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చక్కెర తినకండా ఉన్నంత మాత్రాన ఎవరూ చనిపోవడం లేదు" అని అన్నారు. అప్పట్లో అవి పెద్ద దుమారమే రేపాయి. అయినప్పటికీ పవార్​ అధికారానికి మాత్రం ఎలాంటి ప్రమాదం రాలేదు.

గతంలో ధర్నాలు, నిరసనలు... కానీ ప్రస్తుతం?

మహారాష్ట్రలో గతంలో ఇలా ధరలు పెరిగితే.. ముంబయి లాంటి మహా నగరాల్లో ధర్నాలు జరిగేవి. మధ్యతరగతి ప్రజలతో పాటు చాలా మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నా రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి.

ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయకపోతే ఆక్టోబర్​ 5 తర్వాత ఉల్లిపాయాల వేలాన్ని బహిష్కరిస్తామని 'మహా' రైతులు గతవారమే కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ధరలు తగ్గిపోతాయని, అది తమకు ఆమోదయోగ్యం కాదని వాదించారు. ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగనున్నందున రైతుల డిమాండ్​ను వ్యతిరేకించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యం చేయట్లేదు. మీడియాలోనూ వీటిపై తక్కువ కథనాలే వస్తున్నాయి. ధరలు పెరిగితే.. వాటి వల్ల రైతులు ఎలా లాభపడతారని కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నా... వారి గొంతుకలు ప్రజల వరకు వెళ్లట్లేదు.

భాజపాకు వచ్చిన చిక్కేమీ లేదు!

మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితికి ఒక రకంగా పవార్​ కారణమంటున్నారు నిపుణులు. కొద్ది సంవత్సరాల క్రితం ఆయనతో పాటు చాలా రైతు సంఘాలు ధరల పెంపునకు మద్దతుగా నిలిచాయి. అలా ధరల పెరుగుదల అనే అంశం మహారాష్ట్ర ప్రజలకు సర్వసాధారణమైందిగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఆలోచనను సవాలు చేయడం కూడా కష్టమే. అందుకే ఉల్లి ధరల పెరుగుదలతో ప్రస్తుతానికి భాజపాకు వచ్చిన చిక్కేమీ లేదన్నది నిపుణుల మాట.

ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయబోం: సుప్రీం

Last Updated : Oct 4, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details