తమిళనాడులోని పేరూరు సమీపంలో వాదివేళంపాలాయం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కె.కమలాత్తాళ్. ఉదయాన్నే 6 గంటలకు ఆమె తన ఇంటిలోనే నిర్వహిస్తున్న హోటల్ తెరిచి ఇడ్లీలు విక్రయిస్తుంది. గత 30ఏళ్లుగా ఆమె ఈ హోటల్‌ను నిర్వహిస్తోంది. కేవలం రూపాయికే.. నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతోంది. ఆమె హోటల్‌వద్ద రోజూ భారీ సంఖ్యలో రోజువారీ కూలీలు, పేదలు క్యూకట్టి మరీ.. ఇడ్లీలు ఆరగిస్తారు.
కమలాత్తాళ్‌ది సాధారణ వ్యవసాయ కుటుంబం. కుటుంబసభ్యులంతా పొలం పనులకు వెళ్తుంటే ఆమె ఖాళీగా ఇంటి వద్ద ఉండేది. తానూ ఏదో ఒకటి చేయాలని యోచించిన ఆమె నిరుపేదలకు తక్కువ ధరకే ఇడ్లీలను అమ్మాలనే నిర్ణయంతో 30 ఏళ్ల క్రితం హోటల్‌ను ప్రారంభించింది. తొలుత నాలుగు ఇడ్లీలను కేవలం 50 పైసలకే విక్రయించేది. ఈమధ్యనే ఆ ధరను రూపాయికి పెంచింది.
6 గంటలకే అంతా సిద్ధం...
ఒక రోజు ముందే సరుకులన్నీ సిద్ధం చేసుకొనే ఈ బామ్మ ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే.. ఇడ్లీలూ, చట్నీ తయారుచేస్తుంది. తమ పొలంలో పండే కూరగాయలతో చాలా రుచికరంగా సాంబారు తయారు చేస్తుంది. మొదట్లో పిండిని స్వయంగా రుబ్బేది. ఇటీవలే గ్రైండర్‌ను సమకూర్చుకుంది. కట్టెల పొయ్యి మీదనే ఇడ్లీలు వేస్తూ వచ్చినవారికి వేడివేడిగా అందిస్తుంది.