తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సియాచిన్​: హిమపాతం.. సైనికుల పాలిట శాపం..! - siachen alavanche

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రమది. వ్యూహాత్మకంగా దాయాది దేశాలకు ఎంతో కీలకం ఆ ప్రాంతం. అక్కడ పట్టు నిలుపుకునేందుకు భారత్​.., దక్కించుకునేందుకు పాకిస్థాన్​ సర్వశక్తులు ఒడ్డుతుంటాయి. ఘర్షణ పడుతుంటాయి. ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరుగుతుంది. కానీ... యుద్ధానికి మించిన నష్టానికి కారణమయ్యే ఉమ్మడి శత్రువు అక్కడే మరొకటి ఉంది. అదే... మంచు.

యుద్ధాన్ని మించిన ప్రమాదం- ప్రత్యర్థులు ఇద్దరికీ నష్టం

By

Published : Nov 21, 2019, 4:46 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్​ గ్లేసియర్. హిమాలయాల్లోని కారకోరం పర్వత శ్రేణిలో బానా టాప్​ పోస్ట్​ దగ్గర ఉంది ఈ హిమానీనదం. పోలార్ రీజియన్ తర్వాత అతిపెద్ద హిమానీనదం ఇదే. ఆక్సిజన్​ తక్కువగా లభించే ఈ ప్రాంతం మృత్యువుకు దగ్గరి దారి అనే చెప్పుకోవాలి.

ఏ కాలంలోనైనా ఒక్క గడ్డిపోచైనా మొలవని ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. దేశంలో ఉన్న పెద్ద మంచినీటి సరస్సులలో సియాచిన్​ కూడా ఒకటి. అంతకుమించి ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి. ఇదో వైవిధ్యమైన ప్రదేశమే కాకుండా సైన్యానికి ఒక వ్యూహాత్మక ప్రాంతం కూడా. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రత, హిమపాతం వంటి అంశాలు అక్కడ పహారా కాస్తున్న సైనికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.

తాజాగా ఆరుగురు మృతి

భారీగా మంచు, హిమపాతం కురిసే దాదాపు 20 వేల మీటర్ల ఎత్తైన ప్రదేశంలోని బానా పోస్ట్​ వద్ద సోమవారం పహారా కాస్తున్న ఆరుగురు సైనికులు సహా ఇద్దరు కూలీలపై భారీ మంచు ఫలకాలు పడ్డాయి.

మంచులో చిక్కుకున్న సైనికులను కాపాడటానికి అత్యవసర రక్షక దళాలు రంగంలోకి దిగాయి. అధునాతన పరికరాలతో సైనిక హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అత్యవసర చర్యలు చేపట్టినప్పటికీ వారి శ్రమ వృథా అయింది. మంచులో కూరుకుపోయిన దేహాలను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యంత క్రూరమైన చలికి నలుగురు జవానులు సహా ఇద్దరు పౌరులు ప్రాణాలు వదిలారు. అదృష్టవశాత్తు ఇద్దరు సైనికులు ప్రాణాలు దక్కించుకున్నారు.

సింగపుర్​ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్​తో మాట్లాడారు. సియాచిన్​ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వారి ధైర్య సాహసాలకు గౌరవిస్తున్నామని చెప్పిన రాజ్​నాథ్​... మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.

గతంలోనూ..

2016 ఫిబ్రవరిలో మద్రాస్ రెజిమెంట్​కు చెందిన 10 మంది భారత సైనికులు హిమపాతంలో కూరుకుపోయారు. తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. అదృష్టవశాత్తు హనుమంతప్ప అనే వ్యక్తి మాత్రం ఆ దుర్ఘటన నుంచి బయటపడ్డారు. 30 అడుగుల లోతైన మంచు నుంచి ప్రాణాలతో బయటపడినా.... గాయాల కారణంగా దిల్లీలో చికిత్స పొందుతూ అయిదు రోజుల తర్వాత మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయానికి నెల ముందు మరో ఘటనలో నలుగురు జవానులు మంచు రక్కసికి బలయ్యారు.
1984 నుంచి 2018 మధ్య ఇలా యుద్ధంలో కాకుండా ఇతర కారణాల వల్ల సియాచిన్​లో ఇప్పటివరకు 869 మంది భారత సైనికులు మృత్యువాతపడ్డారు.

ప్రత్యర్థులు సైతం

మరో విధ్వంసకర ఘటనలో ప్రత్యర్థి సైనికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. హిమ ఫలకాలు కదిలి 2012 ఏప్రిల్ 7న వేల టన్నుల మంచు పాకిస్థాన్​ సైనికులపై పడింది. ఈ ఘటనలో ఒకేసారి 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకోకుండానే కఠిన పరిస్థితుల ప్రభావంతో ఇరు దేశాలు సైనికులు ప్రాణాలు కోల్పోవడం విడ్డూరం.

కాలుష్యమే కారణం!

గత మూడు దశాబ్దాలుగా హిమాలయాల అగ్రభాగాన సంభవిస్తున్న హిమపాతాల ప్రభావం ఏటికేడు పెరుగుతోందని నిపుణుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, భూతాపం, ఉష్టోగ్రతలే ఇందుకు కారణమన్నది వారి విశ్లేషణ.

ఆ పేరేలా వచ్చిందంటే...

పాకిస్థాన్​ సైన్యం ఆక్రమించిన పోస్ట్​ను తిరిగిపొందడంలో భాగంగా సుబెదార్​ మేజర్, కెప్టెన్​ బానా సింగ్​ చూపిన పరాక్రమానికి ప్రతీకగా సియాచిన్​లోని బానా టాప్​ పోస్ట్​కు ఆ పేరు పెట్టారు. 1987 జూన్ 26న పాకిస్థాన్​ సైన్యం ఆక్రమించిన స్థలాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి కెప్టెన్​ బానా సింగ్ తక్కువ మందితో కూడిన బృందంతో బయలుదేరారు. 1,500 మీటర్ల ఎత్తైన మంచు గోడను సైతం అధిరోహించి అక్కడ ఉన్న సైన్యంతో పోరాడారు. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

(రచయిత - సంజీవ్ బారువా, సీనియర్ పాత్రికేయుడు)

ABOUT THE AUTHOR

...view details