బంగాల్ శాసన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఫిరాయింపుదారు సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకున్నారు సీఎం మమత బెనర్జీ. ఆయన గతంలో టీఎంసీ తరఫున గెలిచిన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తాను పోటీచేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
సోమవారం నందిగ్రామ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న మమత.. ఫిరాయింపుదారుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పారు.
"నేను ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నందిగ్రామ్ నుంచే ప్రారంభించేదాన్ని. ఇది నాకు కలిసొచ్చిన ప్రదేశం. ఈ సారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నా. అందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆమోదం తెలపాలని కోరుతున్నా. వీలైతే భవానీపుర్ నుంచీ బరిలో ఉంటా. పార్టీని వీడిన వారికి అభినందనలు. వారు భవిష్యత్తులో రాష్ట్రపతి కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి. కానీ బంగాల్‌ను భాజపాకు అమ్మాలనే దుస్సాహసం మాత్రం చేయకండి. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు ఆ పని జరగనివ్వను."
-మమత బెనర్జీ, బంగాల్ సీఎం