'ప్రతీకార రాజకీయాలకు బదులుగా మేధావులను సంప్రదించి ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న' మన్మోహన్ సింగ్ విమర్శలకు స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మాజీ ప్రధాని సూచనలను తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం ఉందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తాను పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నానని.. ప్రభుత్వం నుంచి వారేమి కోరుకుంటున్నారో, ఏమి ఆశిస్తున్నారోననే అంశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా స్పందిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు సార్లు సమావేశమయ్యానన్న నిర్మల.. మున్ముందు మరిన్ని సార్లు చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ఆటో సెక్టార్ రంగంలో మందగమనం, బంగారు దిగుమతులపై పలు వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి. రెవెన్యూ వసూళ్లకు గడువు విధించామనడంలో వాస్తవం లేదని ప్రకటించారు.
" జీఎస్టీ రేట్ల తగ్గింపు నా చేతుల్లో ఉన్న అంశం కాదు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ మాత్రమే జీఎస్టీ రేట్ల తగ్గింపునకు సంబంధించిన సలహాలు, వినతులపై తుది నిర్ణయం తీసుకుంటుంది. బంగారం కొనుగోలు అనేది దేశ ప్రజల సెంటిమెంట్ అని నాకు తెలుసు. కానీ, నిజమేంటంటే పసిడి దేశంలో ఉత్పత్తయ్యే వస్తువు కాదు. మనకు బంగారు నిధులు లేవు. ప్రతి గ్రాము బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం."