తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2020, 7:59 AM IST

Updated : Feb 29, 2020, 9:01 AM IST

ETV Bharat / bharat

భారీ సంస్కరణలతో పంపిణీ వ్యవస్థకు కొత్త వన్నెలు

ప్రపంచదేశాల ఆర్థికాభివృద్ధిలో విద్యుత్తురంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో ఒకప్పుడు భారత్​ దిగువస్థాయిలో ఉన్నా ప్రభుత్వాల కృషి వల్ల  ప్రస్తుతం ఎగుమతిచేసే స్థాయికి ఎదిగింది. అయితే కొన్నేళ్లలో గణనీయ మార్పులొచ్చాయి. ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఒకే గ్రిడ్‌కు అనుసంధానం చేయగలిగారు. ఇదో పెద్ద ముందడుగు. ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సంస్కరణలు కొంతమేర సంతృప్తికరంగా ఉన్నా- పంపిణీ రంగంలో ఇంకా అనేక లోటుపాట్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

electricity
విద్యుత్త్​ రంగంలో భారీ సంస్కరణలు

ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా విద్యుత్తురంగం గుండెకాయ వంటిది. ఒకప్పుడు విద్యుత్తు లోటుతో కునారిల్లిన భారత్‌, విద్యుత్తును ఎగుమతిచేసే స్థాయికి ఎదిగింది. ఈ ఘనత కోసం అన్ని ప్రభుత్వాలూ తమవంతు కృషి చేశాయి. మోదీ ప్రభుత్వం దీన్ని మరింత పరుగులు పెట్టించింది. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్తు పంపిణీని సాకారం చేసింది. సౌభాగ్య పథకంతో ప్రతి ఇంటినీ అనుసంధానించగలిగింది. అన్ని గ్రామాలకు, ఇళ్లకు నాణ్యతగల విద్యుత్తును నిరాటంకంగా సరఫరా చేయడంలో మాత్రం ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంది. ఈ విషయంలో ప్రపంచ ర్యాంకుల్లోనూ భారత్‌ వెనకబడి ఉంది. అందుకే ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రూ.102 లక్షల కోట్ల ప్రణాళికలో దాదాపు రూ.25 లక్షల కోట్లు విద్యుత్తు రంగానికే ప్రత్యేకించారు. పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చారు.

వచ్చే అయిదేళ్లలో మొత్తం విద్యుత్తులో దాదాపు 40 శాతం పర్యావరణ హితకర పునరుత్పత్తి ప్రాజెక్టుల ద్వారానే జరగాలని ప్రణాళిక వేసుకున్నారు. అందుకోసం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మొత్తం విద్యుత్తులో 47 శాతం ప్రైవేటు రంగంలోనే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం ఈ రంగం ఎన్నో సమస్యలతో సతమవుతోంది. విద్యుదుత్పత్తి సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మొదటగా సంప్రదాయ ఉత్పత్తి సంస్థలు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు పడుతున్నాయి. రెండోది, ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బాకీలు పంపిణీ సంస్థలనుంచి రాకపోవడం. మూడోది, ఉత్పత్తికి తగ్గ గిరాకీ లేకపోవడం. విద్యుత్తు సరఫరా, పంపిణీ సంస్థల్లోని లోటుపాట్లే

గణనీయ మార్పులు

విద్యుత్‌ సరఫరా రంగంలో గత కొన్నేళ్లలో గణనీయ మార్పులొచ్చాయి. ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఒకే గ్రిడ్‌కు అనుసంధానం చేయగలిగారు. ఇదో పెద్ద ముందడుగు. ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సంస్కరణలు కొంతమేర సంతృప్తికరంగా ఉన్నా- పంపిణీ రంగంలో ఇంకా అనేక లోటుపాట్లు ఉన్నాయి. పంపిణీ సంస్థలు గత నవంబరుకు రూ.81,085 కోట్లు ఉత్పత్తి సంస్థలకు బాకీ పడ్డాయి. వీటన్నింటి ప్రభావం బ్యాంకులపైనా ఉంది. విద్యుత్‌ సంస్థలకిచ్చిన అప్పులు నిరర్ధక ఆస్తులుగా మారి బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అందుకే ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

మూడు భాగాలుగ సంస్కరణలు

మొత్తం సంస్కరణలను మూడు రకాలుగా విభజించారు. మొదటిది, నిర్మాణపరమైనవి. ఆరంభం నుంచే ప్రధాని మోదీ వీటికి శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యమైనది- విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ ఏర్పాటు. ధరల నిర్ణయాధికారం ఈ కమిషన్‌కే ఉంటుంది. రెండోది, నిర్వహణ సంస్కరణలు. ఇందులో భాగంగా వినియోగదారుడు ఎవరినుంచైనా విద్యుత్తును కొనుగోలు చేసే ‘ఓపెన్‌ యాక్సిస్‌’ విధానాన్ని తీసుకొచ్చారు. అన్ని గ్రామాలకు, ఇళ్లకు విద్యుత్‌ సరఫరా పథకాలు, పట్టణాల్లో సమగ్ర విద్యుత్తు అభివృద్థి పథకం ఇందులో భాగమే. చివరి అంచె ఆర్థిక సంస్కరణలు. ఆర్థికంగా కునారిల్లుతున్న పంపిణీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ‘ఉదయ్‌’ పథకం ద్వారా కొంత ఊరట కలిగించారు. అన్ని రాష్ట్రాల పంపిణీ సంస్థలు (ఒక్క పశ్చిమ్‌ బంగ తప్ప) ఈ పథకాన్ని ఉపయోగించుకున్నాయి.

విద్యుత్​ కష్టాలు

మొదట్లో పంపిణీ సంస్థలు కొంతమేర గాడినపడినా తిరిగి కష్టాల్లో కూరుకుపోయాయి. వీటి ఆర్థిక క్రమశిక్షణ కోసం నిరుడు కేంద్రం కొత్త పథకం తెచ్చింది. దాని ప్రకారం పంపిణీ సంస్థలు పరపతి పత్రం ఇస్తేనే ఉత్పత్తి సంస్థలు విద్యుత్తును సరఫరా చేస్తాయి. ఇది అమలు చేసిన తరవాత ప్రస్తుత బకాయిలు పెద్దగా లేవు. పాత బకాయిలు మాత్రం అలానే ఉన్నాయి. మొత్తం విద్యుత్తురంగంలో బలహీనమైన ‘లింక్‌’ పంపిణీ సంస్థలే. దీనికి అనేక కారణాలున్నాయి. వీటిపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వాలది. వసూళ్లు పకడ్బందీగా లేకపోవడం, విద్యుత్తు కొనుగోళ్లలో వ్యత్యాసాలు, విద్యుత్తు టారిఫ్‌ నిర్ణయాల్లో అశాస్త్రీయత, రాయితీ చెల్లింపులు రాష్ట్రాలు సకాలంలో చేయకపోవడం, ప్రభుత్వ శాఖలే బకాయిలు పడటం... వంటి సమస్యలు పంపిణీ సంస్థలను వెంటాడుతున్నాయి. దీనికితోడు సరఫరా, వాణిజ్య నష్టాలు మోతాదుకు మించి ఉంటున్నాయి. ఈ సంస్థలు రెండు నెలల నుంచి 15 నెలల వరకు ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడంతో విదేశీ సంస్థలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి.

రాష్ట్రప్రభుత్వాల అజమాయిషీ

పంపిణీ సంస్థలు అన్నీ ఒకలా లేవు. దేశవ్యాప్తంగా 41 సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో ఉన్నాయి. వీటిని ఆరు రకాల గ్రేడుల్లో వాటి ప్రామాణికాలను పోల్చుతున్నారు. అందులో ఏడు మాత్రమే పైర్యాంకుల్లో ఉన్నాయి. ఇంకో తొమ్మిది రెండోస్థానంలో నిలిచాయి. మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాల పంపిణీ సంస్థలు లేవు. రెండో కేటగిరీలో ఏపీకి చెందిన తూర్పు పంపిణీ సంస్థ ఉంది. మిగతావి మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి. వార్షిక తలసరి వినియోగం చూస్తే ప్రాంతీయ వ్యత్యాసాలు అధికంగా కనిపిస్తున్నాయి. దేశ సగటు 1,181 కిలోవాట్లు ఉంటే పశ్చిమ ప్రాంతం అత్యధికంగా 1,573 కిలోవాట్లు వాడుకుంటోంది.

ఈశాన్య భారత వినియోగం 401 కిలోవాట్లే. తెలంగాణ 1,727 కిలోవాట్లతో ముందంజలో ఉంటే, ఏపీ 1,388 కిలోవాట్లు మాత్రమే వాడుకుంటుంది. పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళనతో ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తం విద్యుత్తు రంగం సంక్షోభంలో కూరుకుపోతుంది. రుణాలిచ్చిన బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెచ్చరిల్లాయి. కొత్త పెట్టుబడులు మందగిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ సంస్థలకు సరైన సమయంలో చెల్లింపులు చేయకపోవడవల్ల పెట్టుబడులపై పునరాలోచనలో పడ్డాయి.

ఏపీ వైఖరితో కేంద్రానికి తలనొప్పి

విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ వైఖరివల్ల కేంద్రం తలపట్టుకుంది. వైకాపా ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక విద్యుత్‌ పునరుత్పాదక ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ పునస్సమీక్షకు నిర్ణయించడం కేంద్రాన్ని ఆందోళనకు గురిచేసింది. ఏపీ రూ.60 వేలకోట్ల పెట్టుబడితో దేశంలోనే ఉత్పత్తి శక్తిలో రెండోస్థానంలో ఉంది. 4,092 మెగావాట్ల పవన విద్యుత్తు, 3,230 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి శక్తి కలిగిఉంది. ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలు, విదేశీ బహుళజాతి సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రతినిధులతో సంప్రతింపులు జరిపింది. నిర్ణయాన్ని మార్చుకోమని సలహా ఇచ్చింది. సివిల్‌ పనులు, పునరుత్పాదక విద్యుత్తు కాంట్రాక్టులకు గల తేడాను వివరించింది.

ఇందులో రాష్ట్ర సాధక బాధకాలను తీర్చడానికీ సిద్ధపడింది. పలు దఫాలు సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వసంస్థలద్వారా రుణసహాయం కల్పించింది. అంతర్రాష్ట్ర సరఫరాపై విధించే సెస్సులో రాయితీలు కల్పించింది. ఎన్టీపీసీ ద్వారా కొంత విద్యుత్తు కొనుగోలుకు సిద్ధపడింది. ఇలాంటి అనేక ప్రోత్సాహకాలు ఏపీ ప్రభుత్వానికి కల్పించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మంకుపట్టు వీడలేదు. ఇన్నాళ్లూ ఓపిగ్గా వేచిఉండటమే కాకుండా, పునస్సమీక్ష నిర్ణయ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని తెలిపింది. విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయనీ హెచ్చరించింది. అయినా ఫలితం లేకపోవడంతో కొన్ని తీవ్ర చర్యలకు సిద్ధపడుతోంది. ప్రభుత్వ సంస్థలనుంచి రుణ సదుపాయం, బొగ్గు సరఫరా నిలిపేయడం లాంటి తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

మొత్తం రూ.83.5 వేలకోట్ల బకాయిల్లో రూ.20 వేలకోట్లు (25శాతం) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే బకాయిపడటమూ ఇందుకు కారణంగా తెలుస్తుంది. హెచ్చరికల వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఆస్తుల్ని రాష్ట్ర విద్యుత్తు ఆర్థిక కార్పొరేషన్‌కు బదలాయించడానికి నిర్ణయించినట్లు తెలుస్తుంది. దాంతో బ్యాంకుల దగ్గర రుణం తీసుకొని బకాయిలు చెల్లించాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆపై పునస్సమీక్ష నిర్ణయాన్ని రద్దు చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పూనుకోకుండా ఆగుతుంది.

మార్పులకు సమాయత్తం

పంపిణీ రంగ ప్రక్షాళనపై కేంద్రం దృష్టి సారించింది. సరఫరా నష్టాల్ని 10 శాతానికి కుదించడం, దేశవ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, టారిఫ్‌లపై శాస్త్రీయ పద్ధతుల ప్రవేశం, సరఫరా మెరుగుదల, వినియోగదారుడితో ప్రత్యక్ష సంబంధాలు నెలకొల్పడం లాంటివి పంపిణీ రంగ సంస్కరణల్లో ఉంటాయి. మూడు దశల్లో ఈ పథకాన్ని అమలుచేయవచ్చు. తొలిదశలో స్మార్ట్‌ మీటర్లను 2022కి పూర్తిగా అమర్చడం, రెండోదశలో ఇన్సులేటెడ్‌ రక్షిత తీగల ఏర్పాటు, వ్యవసాయ, గ్రామీణ, గృహ వినియోగాలకు ప్రత్యేక ఫీడర్ల అమరిక, ‘స్కాడా’ పథకంతో పూర్తి పర్యవేక్షణ, డేటా సమీకరణ ఉంటాయి. మూడోదశలో శిక్షణ కార్యక్రమాలు అమలవుతాయి.

ఎక్కువ నష్టాలున్న సంస్థల ప్రైవేటీకరణా పథకంలో భాగమేనని చెబుతున్నారు. ఇప్పటికే దిల్లీలో పంపిణీ సంస్థలు పూర్తిగా ప్రైవేటురంగంలో పని చేస్తున్నాయి. సరఫరా, వాణిజ్య నష్టాలను 40 శాతం నుంచి 16 శాతానికి తీసుకువచ్చారు. ఒడిశా ప్రభుత్వమూ అవే చర్యలు చేపట్టింది. వీటి అనుభవంతో కొన్ని పంపిణీ సంస్థలూ అదే బాటలో నడిచే అవకాశాలున్నాయి. పంపిణీ సంస్థలు వృత్తి నైపుణ్యంతో సరైన పరిపాలన సంస్కరణలతో నడచినప్పుడే నాణ్యమైన నిరంతర విద్యుత్‌ పంపిణీ సాకారమవుతుంది. అప్పుడే భారత్‌ ఆర్థికంగా, సామాజికంగా పురోగమిస్తుంది.

కె. రామకోటేశ్వరరావు

రచయిత, సామాజిక విశ్లేషకులు

ఇదీ చూడండి: నూతన భద్రతా సవాళ్ల కోసం.. నవీన సాంకేతిక పరిజ్ఞానం: మోదీ

Last Updated : Feb 29, 2020, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details