తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చలికాలంలో ఇవి పాటిద్దాం.. కరోనాను జయిద్దాం - కరోనా జాగ్రత్తలు

ఏటా చలికాలం వస్తుంది.. పోతుంది. చలిపులిని తట్టుకునేట్టుగా అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఈసారి చలికాలం కాస్త ఇబ్బందే సుమా! ఎందుకంటే ఇది చలికాలమే కాదు. కరోనా కాలం కూడా. ఏటా ఈ కాలంలో వచ్చే ప్లూ జ్వరాలు, జలుబుకు ఈ ఏడాది కరోనా తోడైంది. అందుకే మరింత జాగ్రత్త అవసరం. మరి ఈ శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?

How-To-Protect-Yourself-Against-COVID19-In-Winters-Expert-Reveals
చలికాలం.. చలో ఇవి పాటిద్దాం!

By

Published : Nov 21, 2020, 10:37 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఈసారి చలికాలం చాలా ఇబ్బందికరంగా మారింది. సాధారణ ఫ్లూ జ్వరాలతో పాటు కొవిడ్​ బారినపడే ప్రమాదమూ ఉంది. అందుకే వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవశ్యకమైంది. అవేంటో చూడండి.

రోగ నిరోధకశక్తి పెంచుకోండి...

చలికాలం.. చలో ఇవి పాటిద్దాం!
  • చలికాలంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకూ అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. కుదిరితే కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉన్న బియ్యం, చపాతీ, కేక్‌, పాస్తా వంటి వాటిని తగ్గించి... వీటికి బదులుగా పండ్లు, ధాన్యాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవచ్చు. దంపుడు బియ్యం, ఓట్స్‌, బ్రౌన్‌ బ్రెడ్‌ వంటి వాటినీ ఎంచుకోవచ్చు. క్యారెట్లు, ముళ్లంగి, ఆలూ, ఉల్లి, అల్లం వంటి వేరు సంబంధిత కూరగాయలను ప్రయత్నించొచ్చు.
  • ప్రొటీన్‌ అధికంగా ఉండే గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల వంటివి శీతాకాలంలో ఆరోగ్యానికి మంచివి. జింక్‌ ఎక్కువగా ఉండే మొక్కజొన్న, రాగి, క్వినోవా వంటి తృణధాన్యాలు, విటమిన్‌ సి అధికంగా ఉండే కివి, టమాటా, జామ, నిమ్మ, బొప్పాయ, నారింజ తదితర పదార్థాలు ఎంచుకోండి.
  • మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంట్లో తయారు చేసిన కషాయాలు, హెర్బల్‌ టీలను తీసుకోవచ్చు. రోజూ 4, 5 తులసి ఆకులూ తినండి. దగ్గు, జలుబు నుంచి రక్షణ కోసం అల్లం ఎక్కువగా వాడాలి. పసుపు యాంటి బ్యాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. మెంతి, వెల్లుల్లి కూడా ఆ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటినీ ఎంచుకోవచ్చు.

క్రమం తప్పక వ్యాయామం

చలికాలం.. చలో ఇవి పాటిద్దాం!

వ్యాయామం.. కేవలం శరీర బరువును నియంత్రించేందుకే కాదు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ తోడ్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడటానికి సాయపడుతుంది. ప్రతి రోజూ తప్పక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. రోజూ ఓ అరగంటపాటు తేలికైన వ్యాయామాలు చేసినా చాలు.. చురుకుదనం సొంతమవుతుంది. వీలైనంత వరకు ఉదయాన్నే వ్యాయామం చేయాలి. ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉండటం వలన త్వరగా అలసిపోరు. దాంతో ఎక్కువ సమయం వర్కవుట్స్‌ చేయొచ్చు. ఇంట్లోనే క్రంచెస్‌, పుష్‌-అప్స్‌, సిట్‌-అప్స్‌, ప్లంక్స్‌, స్క్వాట్స్‌, జంపింగ్‌ జాక్స్‌, గ్లూట్‌ బ్రిడ్జ్‌ వంటి వ్యాయామాలు చేయొచ్చు. ఇంటి వ్యాయామాలకు ఉపయోగపడేలా '7 మినిట్‌ వర్కవుట్‌ ఛాలెంజ్‌', 'హోమ్‌ వర్కవుట్‌-నో ఎక్విప్‌మెంట్‌' వంటి అనేక యాప్స్‌ని వినియోగించుకోవచ్చు. వ్యాయామం మధ్యలో తక్షణ శక్తినందించే ఎనర్జీ డ్రింక్స్‌ ఎంచుకోవచ్చు.

జాగ్రత్తలు పాటించాల్సిందే

చలికాలం.. చలో ఇవి పాటిద్దాం!
  • రోజూ ఉదయం సూర్యకిరణాలు శరీరంపై పడేలా చూసుకోండి. దీంతో శరీరానికి కావల్సిన విటమిన్‌-డి అందుతుంది.
  • ఏ కాలంలో అయినా సరిపడా నీటిని తాగాలి. దీంతో శరీరం డీ-హైడ్రేషన్‌కి గురికాదు. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
  • రోజూ 8 గంటల నిద్ర అవసరం. దీంతో మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.
  • మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం ప్రయత్నించొచ్చు. సూర్యనమస్కారాలు ఎంచుకోవచ్చు.
  • ఇక కరోనా తీవ్రత కాస్త తగ్గుతున్నా జాగ్రత్తలు అనివార్యం. ఉష్ణోగ్రత తగ్గినపుడు వైరస్‌ ఎక్కువకాలం జీవించొచ్చు. దీంతో ఇతరులకు వ్యాపించొచ్చు. అందుకే సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు మాస్క్‌ తప్పనిసరి. ఇతరులకు కనీసం మీటరు దూరంలో ఉండేలా జాగ్రత్త పడాలి.

ABOUT THE AUTHOR

...view details