తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోదా ఎందుకు ఇవ్వరు?: ముఖాముఖిలో రాహుల్​ - తెలుగు రాష్ట్రాలు

కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని రాహుల్​ పునరుద్ఘాటించారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పునర్​వైభవం సాధిస్తుందని ధీమాగా చెప్పారు.

హోదా ఎందుకు ఇవ్వరు?: ముఖాముఖిలో రాహుల్​

By

Published : Mar 23, 2019, 6:13 PM IST

రాష్ట్ర విభజన చేసిన పార్టీ. అయినా... రెండు రాష్ట్రాల్లోనూ నష్టపోయింది. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడడం... మరింత ఇబ్బందికరంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్​ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్​లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది? 'ఈనాడు' ముఖాముఖిలో ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ​.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీనిపై ఏమంటారు?

ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ ఏర్పాటుచేశాం. ఎన్నికల్లో గెలవడానికి కాదు. తెలంగాణలో కాంగ్రెస్​ బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని పునర్‌నిర్మించుకోవాలి. అందుకు మా నాయకులు సహకరిస్తారని నమ్ముతున్నా. అక్కడ పార్టీ పునర్వైభవానికి మెండుగా అవకాశాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు? ఎంతకాలమిస్తారు?

ఈ అంశంపై ప్రధానమంత్రిని నిలదీయాలి. చట్టంలో చెప్పిన హామీలు ఎందుకు అమలుచేయలేదని. మేం కేంద్రంలో అధికారం చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. అవసరమైనన్ని రోజులు కొనసాగిస్తాం.

ఇదీ చూడండి:కంచుకోట​లో కమ్యూనిస్టుల అస్తిత్వ పోరాటం

ఏపీకి ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్‌ అభ్యంతరాలు చెబుతోంది కదా?

ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ ఏర్పాటుచేసింది భాజపా ప్రభుత్వం. కానీ అదేమి చేస్తోందో ఎవరికైనా తెలుసా? ఆర్‌బీఐ, సీబీఐ, నీతి ఆయోగ్‌ మొదలుకొని దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఈ ప్రభుత్వం రాజకీయం చేసింది. నిజాయితీపరులు, అనుభవజ్ఞులైన అధికారులను తప్పించి అనుంగులను అందులో నియమించుకొంది. వారంతా భాజపా నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాను. ఆ ఎన్నికల్లో మా పనితీరు ఆశించిన దానికంటే తక్కువగానే ఉన్నా, జాతీయ అంశాలపై జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని నమ్ముతున్నా. తెరాస ప్రభుత్వం ఎంతలా డబ్బు ఉపయోగించిందో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మేమే గెలుస్తామని నమ్ముతున్నా.

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఏమంటారు?

పార్టీ మారేందుకు మా నేతలకు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెబుతున్నారు. పార్టీ వదిలిపెట్టి వెళ్లిపోతోంది అవినీతిపరులే. నిజాయితీపరులు మాత్రమే ఉంటున్నారు. ఇది పార్టీకి మంచిదే. పార్టీ ఫిరాయించిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.

ఇదీ చూడండి:కురువృద్ధులు, ఫిరాయింపుదారులపైనే భాజపా ఆశలు!

ABOUT THE AUTHOR

...view details