'డెస్టినేషన్ నార్త్ ఈస్ట్-2020' కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని.. భారతీయ సంస్కృతికే మణిహారంగా అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే భారత్, భారతీయ సంస్కృతి అసంపూర్ణమని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే శాంతిని నెలకొల్పాల్సిన అవసరముందని, అందుకోసం గత ఆరున్నరేళ్లుగా మోదీ సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం, బ్రూరియాంగ్, బొడో ఒప్పందాలు సహా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మోదీ సర్కారు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు షా
" తీవ్రవాదం, బంద్, హింస వంటి అంశాలతో వార్తల్లో నిలిచే ఈశాన్య రాష్ట్రాలలో.. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గడిచిన ఆరేళ్ల కాలంలో అభివృద్ధి, పరిశ్రమలు, ప్రకృతి వ్యవసాయం, అంకుర పరిశ్రమల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల సమస్యల గురించి పూర్తిగా అర్థం చేసుకున్నవారే... వాటిని మనస్ఫూర్తిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మోదీ నేతృత్వంలో శాంతిస్థాపనకు అనేక చర్యలు చేపడుతున్నాం. 2024 నాటికల్లా ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రిగా... ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యమంత్రులకు నేను హామీ ఇస్తున్నా. "