ప్రశాంత్ భూషణ్.. ఇప్పుడు వార్తల్లో నానుతున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది. ఆయన పలు మార్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. న్యాయపాలికలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలో ప్రాథమిక హక్కులు.. వాక్ స్వాతంత్ర్యం వంటి అంశాలకు రాజ్యాంగాన్ని అన్వయించుకోవడం వంటి కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రశాంత్ భూషణ్‌కు మద్దతు పెరుగుతూ వస్తోంది. న్యాయస్థానం కూడా వివాదాన్ని ముదరనీయకుండా భూషణ్ క్షమాపణ చెప్పే అవకాశాన్ని ఇచ్చింది. దానికి ఆయన నిరాకరించడం వల్ల ఇప్పుడు న్యాయస్థానం తీర్పువెలువరించాల్సి వచ్చింది.
అసలెవరీ ప్రశాంత్ భూషణ్
63 సంవత్సరాల ప్రశాంత్ భూషణ్ న్యాయకోవిదుడి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శాంతి భూషణ్ ప్రముఖ న్యాయవాది.. మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. రాయ్‌బరేలీ నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికను సవాలు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజ్ నారాయణన్ కేసును శాంతిభూషణే వాదించారు. ఈ కేసులో శాంతిభూషణే విజయం సాధించారు. ఆ సమయంలో ప్రశాంత్ భూషణ్ యువకుడు. ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సును మధ్యలోనే వదిలేసి ప్రిన్స్‌టన్ యూనివర్శీటీ నుంచి ఫిలాసఫీ, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రాల్లో పట్టా అందుకొన్నారు. ఆ తర్వాత లాయర్ ప్రాక్టీస్‌లో ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల నిపుణుడిగా పేరు తెచ్చుకొన్నారు. 1980లో సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంస్థను ఏర్పాటు చేశారు.
కీలక కేసుల్లో వాదనలు
ప్రజాప్రయోజనాలతో ముడిపడిన హైప్రొఫైల్ కేసులను ఆయన వాదించారు. ప్రభుత్వ పాలసీల తయారీలో ఆయన కేసులు కీలక పాత్ర పోషించాయి. నర్మదా బచావ్ ఆందోళన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, 1984 అల్లర్లు, బోఫోర్స్, ఎన్రాన్, పన్నాముక్తా చమురు క్షేత్రాల కేసు, నీరా రాడీయా ఆడియో టేపులు కేసు, సీవీసీగా పీజే థామస్ నియామకంపై కేసు, మారిషస్ డబుల్ ట్యాక్సెషన్ కేసు, దళిత్ క్రిస్టియన్లు, ముస్లింల రిజర్వేషన్లపై పిల్ వంటి కేసులను ఆయన వాదించారు.
తాజా వివాదం ఏంటీ..?
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జున్ 27, 29న చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. తొలి ట్వీట్‌లో ఆయన గతంలో పనిచేసిన నలుగురు సుప్రీంకోర్టు సీజీల పనితీరును తప్పుబట్టారు. 29న చేసిన ట్వీట్‌లో ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఓ పార్టీ నాయకుడి బైకు నడిపారని ఆరోపించారు. దీంతోపాటు ఆయన సుప్రీం కోర్టును లాక్‌డౌన్‌లో ఉంచి పౌరులకు న్యాయాన్ని దూరం చేశారన్నది ఆ ట్వీట్ సారాంశం.
ముఖ్యంగా రెండో ట్వీట్‌లో ఆ బైకు ఓ పార్టీ నాయకుడిదని పేర్కొన్నారు. ఆ చిత్రంలో స్పష్టంగా హార్లీడేవిడ్‌సన్ లోగో ఉన్న టీషర్ట్ ధరించిన షోరూం సిబ్బంది కనిపిస్తున్నారు. అది షోరూమ్ నుంచి డెమో కోసం తెచ్చిన బైకుగా తేలింది. సీజే ఎస్‌ఏ బోబ్డేకు బైకులు అంటే ఇష్టం. ఆయన ఈ విషయాన్ని గతంలో 2019 అక్టోబర్ 31న ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ కూడా చెప్పారు. తాను బుల్లెట్‌పై సవారీకి వెళ్లేవాడని పేర్కొన్నారు.