వరుణుడు వరుసగా రెండో రోజూ తన ప్రతాపాన్ని చూపాడు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్లలో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నీటిలో చిక్కుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
కేరళ విలవిల..
కేరళలో వరదల కారణంగా శుక్రవారం ఒక్కరోజే 20 మంది మృతిచెందారు. మొత్తం 14 జిల్లాలకు గానూ 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత మూడు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 28కి పెరిగింది. 24 చోట్ల కొండ చరియలు విరిగిపడి 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన 13 బృందాలు, 180 మంది సైనిక అధికారులు, 16 కోస్టు గార్డు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 64 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వయనాడ్లో పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించాలని కోరారు.
మహారాష్ట్రలో ప్రజల ఇక్కట్లు
మహారాష్ట్రలో గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ, పంచగంగ సహా పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోల్హాపూర్, సంగ్లీ సహా పశ్చిమ మహారాష్ట్రలో జలమయమైన 5 జిల్లాల నుంచి 2.85 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కోల్హాపుర్లో 34, సంగ్లీలో 36 బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
కాంగ్రెస్ నేతల విరాళం