కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ జారీ చేసిన మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అభ్యర్థులను పరీక్షలకు అనుమతించడానికి వీలు లేదని తాజా మార్గదర్శకాల్లో తెలిపింది. ఈ మేరకు సవరణలతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) విడుదల చేసింది.
'కరోనా బాధితులను పరీక్షలకు అనుమతించొద్దు'
కరోనా లక్షణాలతో బాధపడుతున్న అభ్యర్థులను పరీక్షలకు అనుమతించడానికి వీలు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ కోసం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేసింది. సవరణలతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ విడుదల చేసింది.
గతంలో లక్షణాలున్న వాళ్లు కూడా పరీక్షలు రాయాలనుకుంటే వారికి అవకాశం కల్పించాలని తెలిపిన కేంద్రం ఇప్పుడు ఆ వెసులుబాటుని తొలగించింది. కరోనా లక్షణాలతో ఎవరైనా పరీక్ష రాసేందుకు వస్తే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స కోసం పంపాలని సూచించింది. ఆ అభ్యర్థులకు మరో తేదీన లేదా వేరే ఏ మార్గంలోనైనా పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయాలని విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు, పాఠశాలలకు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
కంటెయిన్మెంట్ జోన్ల పరిధిలో ఉండే సిబ్బంది, ఎగ్జామినర్లు పరీక్షల నిర్వహణలో పాలుపంచుకోరాదని వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఉత్తర్వుల్లోనే కేంద్రం తెలపడం గమనార్హం. కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులనూ పరీక్షలకు అనుమతివ్వొద్దని స్పష్టం చేసింది.