నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్, భాజపా జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సహా పలువురు నేతలు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
''భారత ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు.. సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. మరెన్నో సంవత్సరాలు దేశానికి సేవ చేయండి.''
- రామ్నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
మరెన్నో జరుపుకోవాలి: వెంకయ్య
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం.. స్థిరమైన ప్రగతి సాధిస్తోందని ప్రశంసించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మోదీ నిర్దేశకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు.. వేగవంతమైన అభివృద్ధితో పాటు భారత దేశాన్ని ప్రపంచ యవనికపై బలమైన దేశంగా నిలబెట్టాయన్న ఆయన.. మోదీ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.