మధ్యప్రదేశ్ డిండోరీలోని సహజ్పుర్ గ్రామానికి చెందిన భగవాన్ దీన్ చేతి వేళ్లు సరిగ్గా లేకపోయినా, అద్భుతమైన బొమ్మలు గీసి విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నాడు.
దీన్ పుట్టుక నుంచే దివ్యాంగుడు కాదు. ఆర్థరైటిస్ బారిన పడి రెండు చేతులు, ఒక కాలి వేళ్లు వంకరపోయాయి. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా వంకర వేళ్లతోనే తనకెంతో ఇష్టమైన బొమ్మలు వేయడంపై పట్టు సాధించాడు. ఉపాధి కోసం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అతిథి ఉపాధ్యాయుడిగా చేరాడు. వినూత్న బోధనా శైలితో తక్కువ సమయంలోనే విద్యార్థులకు దగ్గరయ్యాడు.
"ఆడుతూ పాడుతూ బోధిస్తే పిల్లలు భయం లేకుండా చదువుతారు. అలా చెప్పడం వల్ల వారికి బాగా అర్థమవుతుంది. వారికి బోర్ కొట్టినప్పుడు కథలు చెప్పడం, వాటికి సంబంధించిన బొమ్మలు గీసి చూపడం చేయాలి. అలా చేస్తే వారు సాయంత్రం 4,5 గంటలైనా ఇంటికి కూడా వెళ్లాలనుకోరు."