లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందా? 21 రోజుల లాక్డౌన్లో సగం రోజులు గడిచిపోయాయి. కొన్ని రాష్ట్రాలు, రైల్వే, విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుంచి లాక్డౌన్ ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉమ్మడి నిష్క్రమణ వ్యహాన్ని సిద్ధం చేసింది కేంద్రం. ఈ వ్యూహం ద్వారా కరోనా కేసులును త్వరగా గుర్తించి ఆ ప్రాంతాలు ఏవో తెలుసుకోగలిగింది ప్రభుత్వం. దీని ద్వారా వైరస్ వ్యాప్తి గొలుసును అడ్డుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా నిరోధించగలిగింది.
తిరిగి పట్టాలెక్కనున్నాయి!
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి రద్దు చేసిన రైల్వే సర్వీసులను తిరిగి విడతల వారిగా పునరుద్ధరించేందుకు మొత్తం 17 రైల్వేజోన్లు, డివిజన్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అయితే పాసింజర్ సర్వీసుల పునరుద్ధరణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ రైల్వే అధికారి తెలిపారు.
విమాన సర్వీసులు...
ఏప్రిల్ 15 నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ఆసియా ఇండియా ప్రకటించింది. అయితే డీజీసీఏ ఇచ్చే తాజా మార్గదర్శకాలను బట్టి ఎప్పుడైన నిర్ణయంలో మార్పు ఉండవచ్చని స్పష్టం చేసింది.
చాలా విమానయాన సంస్థలు ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభించాలని నిర్ణయించాయి.
ప్రధాని సంకేతాలు...
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తి, లాక్డౌన్పై పలు కీలక సూచనలు చేశారు.
ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్లో అంచెలంచెల సడలింపులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రధాని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాలు 100కు దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలో ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేతపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. లాక్డౌన్ను విడతల వారిగా ఎత్తివేసేందుకు చర్చిస్తున్నట్లు తెలిపారు. అయితే వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో మాత్రం కఠిన నిబంధనలు అమలవుతాయని స్పష్టం చేశారు.
అయితే ప్రజలు నిబంధనలు పాటించకపోయినా, కేసులు పెరిగినా మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఏప్రిల్ 15 నుంచి ఎత్తివేయకపోవచ్చని తెలిపింది.
ఉమ్మడి వ్యూహం...
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఉమ్మడి నియంత్రణ వ్యూహం అమలు చేస్తోంది. కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, దిల్లీ, లద్దాఖ్లలో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
మన దేశంలో జనాభా అధికంగా ఉండటం వల్ల కరోనా వైరస్ విస్తరిస్తే ప్రమాదమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కరోనా ప్రభావం దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రకంగా లేకపోవటం వల్ల అధికంగా ఉన్న చోట్ల నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఉమ్మడి వ్యూహంలో తెలిపింది.