పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల సందర్శన చేసేవారికి కేంద్రం తీపికబురు అందించింది. 'పర్యటన్ పర్వ్ పథకం' కింద ఏడాదిలో కనీసం 15 యాత్రాస్థలాలను సందర్శించేవారికి రివార్డులు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పర్యటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. రివార్డు కింద పర్యటన ఖర్చులు అందజేయనున్నట్లు తెలిపారు.
ఫొటోలు ధ్రువీకరణ తప్పనిసరి...
అయితే యాత్రాస్థలాలను సందర్శించిన అనంతరం అక్కడి ఫొటోలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని మంత్రి సూచించారు. సొంత రాష్ట్రం కాకుండా, ఇతర రాష్ట్రాలలోని పర్యటక ప్రాంతాల సందర్శనకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. 2022 నాటికి కనీసం 15 పర్యటనలు పూర్తి చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.