70 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య. ప్రతిరోజూ తుపాకీ గుళ్ల చప్పుళ్లతో అలసిపోయిన ప్రాంతం. ఓ వైపు ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు.. మరోవైపు అల్లరిమూకలు, ఉగ్రపంజాలో చిక్కుకుపోయిన యువకులు. ఇది కశ్మీరు పరిస్థితి. అయితే మోదీ 2.0 సర్కారు నేడు కశ్మీరు సమస్య పరిష్కారానికి రామబాణం వదిలింది.
ఓ వైపు వేల సంఖ్యలో బలగాల మోహరింపు... మరోవైపు కీలక నేతల గృహనిర్బంధం... ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధింపు... జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నిత్యపర్యవేక్షణ.. ఏం జరుగుతుందో అన్న సందేహాలు దేశ ప్రజల మదిని తొలిచేస్తున్న వేళ... "370 అధికరణ రద్దు" అంటూ రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
చకచకా...
జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకొన్నాయి. ఉదయం కేబినెట్ భేటీ, భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం పూర్తయ్యాయి. అనంతరం ఆర్టికల్ 370ను రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన తీర్మానాలు, బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
- ఇదీ చూడండి: కశ్మీర్: 370, 35ఏ అధికరణలు రద్దు
గందరగోళం...
అమిత్ షా ప్రకటనతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. విపక్ష సభ్యులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
అదే సమయంలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు.
ఏంటీ 370..?
370 అధికరణ రద్దుతో జమ్ముకశ్మీర్‌లో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్ 370(3)తో జమ్ముకశ్మీర్... లెజిస్లేటీవ్ అసెంబ్లీగా మారుతుంది. ఇక జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి అమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది.
- ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: ఆర్టికల్ 370 అంటే ఏంటి?
35ఏ అధికరణ..?
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370లో 35-ఎ నిబంధన ఒక భాగం. ఈ నిబంధన కశ్మీర్‌లోని శాశ్వత నివాస నిబంధనలను సమగ్రంగా విశదీకరిస్తుంది.
- ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: ఏంటీ ఆర్టికల్ 35-ఎ?
రాష్ట్ర విభజన..
370 రద్దుతోపాటు ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా విభజించేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో జమ్ము-కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించనున్నాయి.
- ఇదీ చూడండి: దేశంలో ఇక 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు