ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కరోనా టీకా తయారీ కోసం పరుగులు పెడుతున్నాయి. అగ్ర దేశాలన్నీ ఒకదాన్ని మించి మరొక సమర్థమైన వ్యాక్సిన్ తయారీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. చాలా వ్యాక్సిన్లు ఇప్పటికే తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు ఇన్ని కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ ఎలా అందుబాటులోకి తీసుకొస్తారు? అనేదానిపై స్పష్టత లేదు. అయితే ఈ అంశంపై తాజాగా ప్రభుత్వ వర్గాలు సమాధానమిచ్చాయి.
టీకా పంపిణీ కార్యక్రమాలు..
ప్రస్తుతం చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు పలు టీకా కార్యక్రమాలు నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. పోలియో, ధనుర్వాతం వంటి వ్యాధుల నుంచి రక్షణ కోసం ఇంటింటికీ టీకాలను అందిస్తోంది. ఇందుకు ఆరోగ్య కార్యకర్తలతో ప్రత్యేకమైన నెట్వర్క్ ఉంది. ఇదే తరహాలో ప్రత్యేకమైన కొవిడ్-19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
ప్రభుత్వ సేకరణ...
కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి ప్రాధాన్య క్రమంలో పంపిణీ చేయనుంది. వాటిని ఉచితంగానే ప్రజలకు అందించనుంది. రాష్ట్రాలు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ను సేకరించుకోవాల్సిన పనిలేదు. ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వ నెట్వర్క్ ద్వారా పంపిణీ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో భాగస్వామ్యం వహించనున్నాయి. తొలి దశలో దాదాపు 30 కోట్ల మంది వ్యాక్సిన్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని తెలుస్తోంది.
నాలుగు కేటగిరీలుగా..
వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో నాలుగు కేటగిరీలు చేసింది ప్రభుత్వం.
1. కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు(డాక్టర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆశా వర్కర్లు)
2. రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు(పోలీస్, మున్సిపల్, సైనిక బలగాలు)
3. యాభై ఏళ్ల వయసు దాటిన 26 కోట్ల మంది ప్రజలు
4. అనారోగ్యంతో ఉండి 50 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు.
" ప్రాధాన్య జనాభా సమూహాల జాబితాను నవంబర్ నాటికి సిద్ధం చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది కేంద్రం. టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న అందరినీ ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారు. ఫలితంగా ఎవరెవరికి వ్యాక్సిన్ వేశారో గుర్తించడం సులభం అవుతుంది"
-- ప్రభుత్వ ఉన్నతాధికారి
సేకరణ నుంచి శీతలీకరణ వరకు..
ప్రస్తుతం ఉన్న సాంకేతికత, ఆరోగ్య కార్యకర్తల నెట్‌వర్క్‌ను వినియోగించే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం(యూఐపీ)ను నిర్వహిస్తున్నారు. దీన్నే కరోనా వ్యాక్సిన్ పంపిణీలోనూ వాడనున్నారు. కరోనా వ్యాక్సిన్ కొనుగోలు లేదా సేకరణ నుంచి పర్యవేక్షణ, రవాణా, పంపిణీ వరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది.
ఆరోగ్య కార్యకర్తలకు అంతర్జాల సాయంతో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీపై పాఠాలు చెప్పనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్(ఈవీఐఎన్) ద్వారా దేశంలోని అన్ని శీతలీకరణ పాయింట్లలో వ్యాక్సిన్ స్టాక్, స్టోరేజీ కేంద్రాలలో ఉష్ణోగ్రత స్థాయిలు వంటి అంశాలపై రియల్‌టైమ్ సమాచారం అందుబాటులోకి తీసుకురానున్నారు.
కరోనా వ్యాక్సిన్‌పై ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం, స్టోరేజీ వ్యవస్థను మరింత పెంచడంపై సూచనలు చేస్తూ ఒక ప్రణాళికనూ రూపొందించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. శీతలీకరణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రైవేటు సంస్థల సహకారాన్ని తీసుకోనున్నారు.
వచ్చే ఏడాది జులై నాటికి...
2021 జులై నాటికి దాదాపు 40 నుంచి 50 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 25 కోట్ల మందికి పైనే ఇది లబ్ధి చేకూర్చనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
"ప్రస్తుతం ఏటా 27 మిలియన్ల నవజాత శిశువులకు ప్రభుత్వం టీకా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న ఐటీ సాంకేతికత, వైద్య సిబ్బందితో కూడిన నెట్వర్క్ వల్ల కరోనా టీకా పంపిణీ సులభమవుతుంది. చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్ అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది"
-- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భాజపా తన మ్యానిఫెస్టోలో వ్యాక్సిన్ గురించి ప్రస్తావించింది. ఎన్డీఏ మరోమారు అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించడం వివాదాస్పదమైంది.