తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశీ నటుడి ప్రచారంపై కేంద్రం ఆగ్రహం

బంగాల్​లో ఓ బంగ్లాదేశీ నటుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే భారత్​ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆయన వ్యాపార వీసాను రద్దు చేసింది.

By

Published : Apr 17, 2019, 5:56 AM IST

Updated : Apr 17, 2019, 7:54 AM IST

బంగాల్​లో విదేశీ నటుడి ప్రచారం

బంగాల్​లో విదేశీ నటుడి ప్రచారం

బంగ్లాదేశ్​ ప్రముఖ నటుడు ఫిర్దోస్​ అహ్మద్​పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ్​ బంగాల్​లో తృణమూల్​ తరఫున ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆయన వ్యాపార​ వీసానూ రద్దు చేసింది.

రాయ్​గంజ్​ లోక్​సభ స్థానంలో తృణమూల్​ అభ్యర్థి కన్నయ్య లాల్​ అగర్వాల్​ తరఫున ప్రచారంలో ఫిర్దోస్​ పాల్గొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

"అందరూ తృణమూల్​ కాంగ్రెస్​కు ఓటు వేయాలి. దీదీకే మీ ఓటు పడాలి."
-వీడియోలో ఫిర్దోస్​ అహ్మద్​ మాటలు

ఈ విషయంపై అహ్మద్​కు కేంద్ర ప్రభుత్వం 'లీవ్​ ఇండియా' నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ అహ్మద్​ను బ్లాక్​లిస్ట్​లో చేర్చింది. భవిష్యత్తులో భారత్​కు రాకుండా నిషేధం విధించింది.

ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారికి బంగాల్​ భాజపా నేతలు జయప్రకాశ్​ మజుందార్​, శిశిర్ బజోడియా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు తృణమూల్​ కాంగ్రెస్​పై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓ విదేశీ వ్యక్తి వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయటం ఏమిటని ప్రశ్నించారు.

"ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు. తృణమూల్​ అక్రమ రాజకీయాలకు ఈ ఘటనే నిదర్శనం."
-జయప్రకాశ్ మజుందార్​, భాజపా నేత

నాకేమీ తెలియదు: అగర్వాల్​

ఈ విషయంలో తనకేమీ తెలియదని తృణమూల్​ అభ్యర్థి అగర్వాల్​ తెలిపారు. తన కోసం ఏ నటుడు ప్రచారంలో పాల్గొనలేదని చెప్పారు.

"ఆయన(ఫిర్దోస్​) ప్రచారం చేశారన్న విషయం నాకేమీ తెలియదు. నాకోసం ఇద్దరే ప్రచారం చేశారు. మమతా బెనర్జీ, సువేందు అధికారి. నేను దీదీతో రెండు సభల్లో పాల్గొన్నారు. సువేందుతో ఇస్లాంపూర్​ రోడ్​షోకు హాజరయ్యాను."
-కన్నయ్యలాల్​ అగర్వాల్, తృణమూల్​ అభ్యర్థి

ఇదీ చూడండి: తమిళనాడు వేలూరు లోక్​సభ ఎన్నిక రద్దు

Last Updated : Apr 17, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details