దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయడం సహా ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండే టీకా అభివృద్ధి కోసం 'మిషన్ కొవిడ్ సురక్ష'ను కేంద్రం ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రూ. 3 వేల కోట్ల ప్రారంభ నిధితో దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించాయి.
జీవసాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ మిషన్.. టీకా క్లినికల్ ట్రయల్స్ నుంచి తయారీ వరకు ప్రతి ఒక్క దశపై దృష్టిసారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. కనీసం ఆరు వ్యాక్సిన్ క్యాండిడేట్లకు లైసెన్సులు లభించేలా చేసి, సత్వరం మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ ప్రతిపాదనలు పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. మిషన్ కాల వ్యవధి 12 నుంచి 18 నెలలు ఉంటుందని స్పష్టం చేశారు. దేశ అవసరాలకు తీర్చే విధంగా ఈ మిషన్ పనిచేస్తుందని చెప్పారు.