తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 2:22 PM IST

ETV Bharat / bharat

సాగు చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?

సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనల్ని ఆపడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల ప్రతిపాదనలకు ఒప్పుకుంటూ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Farm
సాగు చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరోసారి భేటీ అయింది. అయితే రైతుల ప్రతిపాదనలకు ఒప్పుకుంటూ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతుల ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కేంద్ర మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమైన మోదీ.. రైతు సంఘాలు లేవనెత్తిన అంశాలు, చట్టాల రద్దు డిమాండ్లపై వ్యవహరించాల్సిన వైఖరిపై సుదీర్ఘంగా చర్చించారు.

అయితే నేటి సమావేశంలో చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం అన్నదాతలకు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కనీస మద్దతు ధరపై రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రయివేటు మండీలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ అంశాన్ని కూడా పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు చట్టాలపై రైతులకున్న సందేహాలు ఇవాల్టితో తీరుతాయని, సమావేశం అనంతరం వారు కచ్చితంగా ఆందోళన విరమిస్తారని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్‌ చౌదరి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details