సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్ నియామకంపై ప్రశ్నల వర్షం కురిపించింది కాంగ్రెస్. ఈ విషయంలో కేంద్రం తప్పటడుగు వేసిందని విమర్శించింది. ఈ పరిణామంతో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించింది.
సీడీఎస్ నియామకం ఓ తప్పటడుగు: కాంగ్రెస్
సీడీఎస్ నియామకం విషయంలో కేంద్రం తప్పటడుగులు వేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నో అస్పష్టతల నడుమ త్రివిధ దళాల ప్రధానాధికారిని ఎంపిక చేసిందని విమర్శించింది. సీడీఎస్ పదవి ప్రాధాన్యం, విధులు తదితర అంశాలపై ట్విట్టర్లో కేంద్రానికి ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ ఆధికార ప్రతినిధి మనీశ్ తివారీ.
సీడీఎస్
ఎన్నో ఇబ్బందులు, అస్పష్టతల నడుమ సీడీఎస్‌ను నియమించాల్సిన అవసరం ఏముందని ట్విట్టర్ వేదికగా నిలదీశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ. సీడీఎస్ నియామకంపై మరికొన్ని ప్రశ్నలు సంధించారు. అవి...
- సీడీఎస్‌ను రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి త్రివిధ దళాల అధిపతులు సలహాలు ఇచ్చే విషయంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? సంబంధిత దళాధిపతి ఇచ్చిన సిఫార్సుకన్నా సీడీఎస్ సూచనకే ఎక్కువ విలువ ఉంటుందా?
- త్రివిధ దళాల అధిపతులు ఇప్పుడు రక్షణ మంత్రికి... రక్షణ శాఖ కార్యదర్శి ద్వారా రిపోర్ట్ చేయాలా లేక సీడీఎస్ ద్వారానా?
- రక్షణ మంత్రిత్వశాఖకు పరిపాలనా సారథిగా రక్షణ కార్యదర్శి కొనసాగుతారా? ప్రతిపాదిత సైనిక వ్యవహారాల శాఖ నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటి?
- త్రివిధ దళాల పరిధిలోని సంస్థల విషయంలో సంబంధిత అధిపతులకన్నా సీడీఎస్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయా?
- పౌరులు-సైన్యం బంధంపై సీడీఎస్ నియామకం ప్రభావం ఎలా ఉంటుంది? 1947 నుంచి పౌరులు-సైన్యం బంధం విషయంలో భారత్ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నామా?