గోవా ఉపముఖ్యమంత్రి ధవలికర్పై వేటు గోవా రాజకీయం వేడిక్కింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. కానీ వారి నిర్ణయాన్ని ఎంజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సుదిన్ ధవలికర్ వ్యతిరేకించారు. దీంతో ధవలికర్పై వేటు పడింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నిర్ణయం తీసుకున్నారు.
ధవలికర్ను కేబినెట్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ మృదులాసిన్హాకు తెలియజేశారు ప్రమోద్ సావంత్. ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం తెలిపారు గవర్నర్.
" కేబినేట్ నుంచి సుదిన్ ధవలికర్ను తొలగించాం. ఖాళీ ఏర్పడిన సీటును భర్తీ చేయటంపై త్వరలోనే ప్రకటన చేస్తాం." -ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి.
ప్రస్తుతం ధవలికర్ వద్ద ఉన్న ప్రజారవాణా, పౌర పనులు మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి పర్యవేక్షించనున్నారు.
ముగ్గురులో ఇద్దరు భాజపాలోకి
మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం పార్టీకి చెందిన మనోహర్ అజ్గాంకర్, దీపక్ పవాస్కర్ భాజపాలో చేరారు. శాసనసభాపక్షాన్ని భాజపాలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ మిచెల్ లోబోకు లేఖ రాశారు. ఎంజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ధవలికర్ ఆ లేఖపై సంతకం చేయలేదు.
ఇదీ చూడండీ: భారత్ మరో మైలురాయి... 'మిషన్ శక్తి' సఫలం