తెలంగాణ

telangana

ETV Bharat / bharat

113 ఏళ్లుగా ఆగని 'గ్లోగి' వెలుగులు - ఉత్తరాఖండ్​ న్యూస్​

దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్తు ఉత్పత్తి ఎక్కడ ప్రారంభమైందో మీకు తెలుసా? దేశం బ్రిటిష్‌ బానిసత్వంలో మగ్గుతున్న సమయంలో నిర్మించిన ఆ విద్యుత్తు కేంద్రం ఇప్పటికీ కరెంటును ఉత్పత్తి చేస్తోంది. పాతతరం సాంకేతితతోనే 113 ఏళ్లుగా వెలుగులు పంచుతోన్న ఆ పవర్ ‌ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం.

Glogl Power Plant in Uttarakhand
గ్లోగీ పవర్ ప్రాజెక్టు

By

Published : Sep 12, 2020, 3:10 PM IST

గ్లోగీ పవర్ ప్రాజెక్టు

ఈ ఆధునిక యుగంలోనూ గాంధీజీ మాటే మేలిమి బాటగా ఉంది. అభివృద్ధి నమూనాలే రూపు మార్చుకుంటూ వస్తున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం అభివృద్ధి కోసం వేసిన అలాంటి ఎన్నో పునాదులు ఉత్తరాఖండ్‌లో దర్శనమిస్తాయి. బ్రిటిష్ పాలనలో.. చాలా నగరాల్లో కరెంటు లేని సమయంలో... డెహ్రాడూన్‌, మసూరీ ప్రాంతాల కోసం.. 1890లో గ్లోగీ పవర్ ప్రాజెక్టు ప్రారంభించారు.

ఇది దేశంలోనే మొదటి జల విద్యుదుత్పత్తి కేంద్రం. ఇప్పటికీ డెహ్రాడూన్, మసూరీకి విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఆంగ్లేయుల కాలం నాటి టర్బైన్లనే ఇప్పటికీ వాడుతున్నారు. 1906-07లో ఇక్కడ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. అప్పటి వరకు ముంబయి, దిల్లీ వంటి నగరాల్లోనే కరెంటు ఉండేది. మసూరీలోని గ్లోగీ విద్యుత్‌కేంద్రం దేశం బ్రిటిష్‌ బానిసత్వంలో ఉన్న సమయంలోనూ ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది.

ఎడ్లబండ్లపై టర్బైన్ల తరలింపు..

1900 సంవత్సరంలో డెహ్రాడూన్‌కు తొలిసారిగా వచ్చిన రైలు.. ప్రాజెక్టు వేగంగా పూర్తవడంలో ప్రధానపాత్ర పోషించింది. ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న భారీ యంత్రాలు, టర్బైన్లు ముంబయి వరకు నౌకల్లో రాగా, అక్కడి నుంచి డెహ్రడూన్‌కు తరలించారు. కొండ ప్రాంతానికి కొన్ని వందల అడుగుల కింద ఏర్పాటు చేసిన గ్లోగీ పవర్‌ హౌస్‌ వరకూ ఎడ్లబండ్లపైనే చేరవేశారు. 1907లో క్యార్‌కులీ, భట్టా ప్రాంతాల్లోని చెరువుల్లోని నీటిని...16అంగుళాల పైపులైన్ల ద్వారా భారీ టర్బైన్లను నడిపేందుకు వినియోగించారు. అలా డెహ్రడూన్, మసూరీలోని ఇళ్లకు కరెంటు సరఫరా అయింది.

1920 నాటికి విద్యుదీకరణ..

9 నవంబర్ 1912న గ్లోగీ రెండో జల విద్యుదుత్పత్తి కేంద్రం నెలకొల్పారు. 1920 కల్లా... మసూరీలోని అన్ని బంగ్లాలు, హోటళ్లు, పాఠశాలల నుంచి నూనెదీపాలు తొలగిపోయి, విద్యుత్ కాంతులొచ్చాయి. క్రమంగా డెహ్రడూన్, మసూరీ ప్రాంతం మొత్తానికి విద్యుదీకరణ పూర్తైంది. 70 ఏళ్లపాటు గ్లోగీ పవర్‌ప్లాంట్ బాధ్యతలు మసూరీ మున్సిపాలిటీ చూసుకుంది.

" దేశంలోనే సొంతంగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఇది. విద్యుత్ ఉత్పత్తి చేసి, వినియోగదారులకు అమ్మింది."

- గణేశ్ సైలీ, రచయిత

పాతతరం సాంకేతికతతోనే..

డెహ్రాడూన్, మసూరీ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయం కారణంగా... మసూరీ మున్సిపాలిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే అత్యంత సంపన్న స్థానిక పాలకసంస్థగా నిలిచింది. 1976లో పవర్‌హౌస్ సహా మున్సిపాలిటీకి చెందిన అన్ని పవర్ వెంచర్లను ఉత్తర్‌ప్రదేశ్ విద్యుత్ కౌన్సిల్ సొంతం చేసుకుంది. 35ఏళ్లలో ఈ కేంద్రం ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. గడచిన 2,3 దశాబ్దాలలో పాతతరం నిపుణులు ఉద్యోగవిరమణ చేశారు. శతాబ్దం కిందటి పాత టర్బైన్లు, యంత్రాలు నడిపే, మరమ్మతు చేసే సామర్థ్యాలు వారి సొంతం. విదేశీయంత్రాలు పాత సాంకేతికతతో తయారుచేసినవి, ప్రస్తుతం వీటి తయారీ ఎక్కడా జరగడంలేదు.

స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత..

ఉత్తరాఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత జలవిద్యుత్ నిగం గ్లోగీ పవర్‌ ప్లాంట్ బాధ్యతలు వాళ్లే తీసుకున్నారు. దీని వైభవం, చరిత్ర తర్వాతి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాంటుపునరుద్ధరణ, ఆధునికీకరణ, సామర్థ్యాల పెంపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 113 ఏళ్లనాటి ఈ విద్యుదుత్పత్తి కేంద్రం ఉత్తరాఖండ్‌కు గర్వకారణంగా కూడా నిలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details