పాతికేళ్లు చెత్త ఏరి.. తనకు తానే విగ్రహం కట్టుకొని.. తమిళనాడు, సేలం జిల్లాలో పాతికేళ్ల కష్టార్జితంతో తనకు తానే విగ్రహం నిర్మించుకున్నాడు ఓ వ్యక్తి.
సేలం, వాజప్పడి సమీపంలోని అథనుపట్టి తూకియపాల్యం గ్రామానికి చెందిన నల్లతంబీ (60).. పాతికేళ్ల కిందట కలహాల కారణంగా కుటుంబం నుంచి వేరయ్యాడు. భార్య, పిల్లలను వదిలేసి అదే ప్రాంతంలో మరో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. చెత్తకుప్పల్లో సీసాలు ఏరుకుని వాటిని విక్రయించి పూట గడిపేవాడు. మిగిలిన సొమ్మును దాచుకున్నాడు. తనకంటూ ఓ ఇల్లు నిర్మించుకున్నాడు.
అయితే, కొద్ది రోజుల క్రితం నల్లతంబీకి ఓ వింత కోరిక కలిగింది. తాను మరణించాక ఈ గ్రామస్థులు తనను మరచిపోకుండా ఏదో ఒకటి చేయాలనిపించింది. స్నేహితులను కలిసి సలహా అడిగాడు. చివరిగా ఓ విగ్రహం నిర్మించుకుంటే అది నల్లతంబీ గుర్తుగా చిరస్మరణీయంగా ఉండిపోతుందని భావించాడు.
అనుకున్నదే ఆలస్యంగా.. 25 ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుతో రెండు ప్రాంతాల్లో 1,200 చదరపు అడుగుల చొప్పున స్థలం కొన్నాడు. విగ్రహం నిర్మించడానికి ఓ శిల్పితో రూ. 1.30 లక్షలతో బేరం కుదుర్చుకున్నాడు. ఎట్టకేలకు వాజప్పడి బేలూర్ గ్రామంలోని తన స్థలంలో 'నల్లతంబీ విగ్రహాన్ని' ఆవిష్కరించుకున్నాడు.
ఇదీ చదవండి: ముట్టుకోకుండానే మోగుతున్న గుడి గంట