''ప్రజల అభిప్రాయాన్ని మలచటంలో, వారి మద్దతు సమీకరించటంలో సమాచారమాధ్యమాలు తిరుగులేని సాధనాలు''
స్వాతంత్ర్యసంగ్రామంలో ఇదేమాట త్రికరణశుద్ధిగా నమ్మారు మహాత్మాగాంధీ. నిజానికి విద్యార్థిదశ నుంచే తనలోని జర్నలిస్ట్‌కు సానపడుతూ వచ్చారు. లండన్‌లో చదివేటప్పుడు 'ద వెజిటేరియన్' అనే ఆంగ్ల వారపత్రికకు ఫ్రీలాన్సర్‌గా 9 కథనాలు రాసిన బాపూ.. అప్పటి నుంచే సరళమైన భాషలో జనానికి చేరువకావటం అలవర్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన మూడవ రోజే కోర్టులో జరిగిన తీవ్ర అవమానం గురించి స్థానికపత్రికలో ఓ వ్యాసం రాశారు. ఈ విషయం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లటంతో పత్రికా స్వేచ్ఛ ఉందని గ్రహించి... ఆయనను రచనా వ్యాసంగంవైపు నడిపించింది.
పాత్రికేయునిగా, వ్యాసకర్తగా, రచయితగా గాంధీజీ ప్రయాణం దక్షిణాఫ్రికాలో 1903లో మొదలై తుదికంటా సాగింది. 1903 నుంచి 1914 వరకూ, తిరిగి 1919 నుంచి 1948లో తుదిశ్వాస విడిచే వరకూ.. గుజరాతీ, ఆంగ్లంతో పాటు వివిధ భాషల్లో మహాత్ముడు వారపత్రికలు ప్రచురించారు. యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్, ఇండియన్ ఒపీనియన్ పత్రికల ద్వారా గాంధీజీ చేసిన ప్రయత్నం.. ఇతర నాయకుల నుంచి ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. 'ఇండియన్ ఒపీనియన్' పత్రిక లేకుండా సత్యాగ్రహం అసాధ్యం అని ఆయన విశ్వసించేవారు గాంధీ. ప్రజల మనిషి గా వారి కష్టాలు, నష్టాలు, ఆకాంక్షలు.. అన్నింటి గురించి విస్తృతంగా రాసేవారు.
పాత్రికేయులకు ఉండాల్సిన లక్షణాలేంటో తెలుసా..
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్వాతంత్య్రం ఎంత అవసరమో.. తన రచనల ద్వారా ప్రజలకు చేరవేయాలని తపించేవారు గాంధీజీ. పత్రికలు, పాత్రికేయులకు 3 లక్షణాలు ఉండాలని నమ్మేవారు. ప్రజలభావాల్ని అర్థం చేసుకుని వాటికి అక్షరరూపం ఇవ్వటం, ప్రజల భవిష్యత్‌కు అవసరమైన ఉద్వేగాలు తట్టిలేపటం, వ్యవస్థల లోటుపాట్లు నిర్భీతిగా ఎత్తిచూపటం చేయాలని కోరుకునే వారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని పోరుబాట పట్టించటమే వీటి ఉద్దేశ్యం. 4 దశాబ్దాల పాత్రికేయజీవితంలో నమ్మిన 3 సిద్ధాంతాల్ని ఏనాడూ బాపూజీ విడిచిపెట్టలేదు.
తన కథనాల ద్వారా ప్రభుత్వాలకు ఇచ్చే విన్నపాలు, విజ్ఞప్తుల్లో జర్నలిస్ట్‌గా గాంధీజీ చూపిన తెగువ స్పష్టంగా కనిపించేది. 1894 అక్టోబర్ 25న 'టైమ్స్ ఆఫ్ నేటల్'కు 'రామీ సామీ' పేరుతో రాసిన సంపాదకీయంలో ఈ ధిక్కారం గమనించవచ్చు. అందులోని ఓ వాక్యం ఇలా ఉంటుంది.
''మీరు బయట కనిపించే చర్మాన్నే చూస్తారు. మీకు చర్మం తెల్లగా ఉంటే చాలు. దాని మాటున విషముందా, తేనె ఉందా అనే పట్టింపు మీకు లేదు.''