దాయాదుల పోరు, అంతర్యుద్ధాలు, దురాక్రమణలు, ఒప్పందాల ఉల్లంఘనలు... ప్రపంచశాంతి ప్రమాదంలో పడేందుకు కారణాలు. వీటన్నింటి నుంచి ప్రపంచం బయటపడలేదా..? అసలు ప్రపంచశాంతి అంటే ఏమిటి..? అది అర్థం కాని జడపదార్థమా...? కానేకాదు. అన్ని దేశాలు పరస్పర సహకారంతో కలిసి నడవడమే.. ప్రపంచశాంతి.
యుద్ధాన్ని నివారించాలి. అహింస పాటించాలి. ఆ దిశగా బాధ్యతాయుతమైన దేశాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అప్పుడే ప్రపంచశాంతి సాధ్యం. మరి ప్రపంచం అలా ఉందా..? అంటే లేనేలేదు. పూర్తి విరుద్ధంగా ఉంది. పరస్పర సహకారం మాటేమో గానీ.. విభేదాలు మాత్రం ఉన్నాయి. ఎక్కడ చూసినా ఘర్షణలే. అంతర్జాతీయ సరిహద్దు, జాతి వైరుద్ధ్యాలు, మత ఛాందసవాదం, నదీ జలాల వివాదాలపై దశాబ్దాలుగా పరస్పర ఆరోపణలే. సంప్రదింపులు, చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలనే తీర్మానాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం ఉండటం లేదు.
ప్రపంచ దేశాలు సిద్ధంగాలేవా..?
అనుమానాలు, భయాలతో బతుకుతున్న ప్రపంచదేశాలకు గాంధేయవాదమే సరైన పరిష్కారం. దేశాలకు అతీతంగా బాపూజీని ఆరాధిస్తున్నప్పటికీ.. మహాత్ముడి తత్వాన్ని మాత్రం ఆచరించడం లేదు. ప్రపంచశాంతికి గాంధేయవాదం ఓ పరిష్కారమని భావించడం లేదు. గాంధీ విధానాలు నేటికాలానికి సరిపోవని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. శాంతియుతంగా, అహింసా పద్ధతిలో గాంధీజీ పోరాటం చేసినప్పటి కంటే.. ఇప్పటి విభేదాల్లోని సంక్లిష్టత ఎక్కువనే ఆలోచనలో ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక అంశాలకే గాంధీ భావజాలం ఉత్తమ పరిష్కారమని భావిస్తున్నాయి. కానీ.. గాంధేయతత్వం, అంహిసా విధానంపై వాస్తవానికి వచ్చి ఆలోచిస్తే.. అందులోని ఔచిత్యం అర్థమవుతుంది. అందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.
బాపూ రచనలు, సూచనలే మార్గం...
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, సంఘర్షణలకు 7 దశాబ్దాల క్రితమే బాపూజీ పరిష్కారం చూపారు. ఆయన ఆచరణపై లోతైన ఆలోచనలు చేసి, విశాల దృక్పథంతో విశ్లేషణ చేస్తే.. అప్పటి పరిస్థితులు, నేటి స్థితిగతుల మధ్య పోలిక కనిపిస్తుంది. నాడు గాంధీ ఏం చేశారో.. ఇప్పడేం చేయాలో తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేయకపోవడం వల్లే.. హింసను ఎదుర్కోవడం, శాంతి నెలకొల్పడంలోని వైఫల్యం అణువణువునా కనిపిస్తుంది. వివిధ సందర్భాల్లో శాంతిపై గాంధీ రాసిన వ్యాసాలు, ఆయన చేసిన సూచనలు.. సమకాలీన ప్రపంచంలో వివిధ దేశాల మధ్య నెలకొన్న విభేదాలకు.. ఉత్తమ పరిష్కారాలు.
మూడో పక్షం జోక్యం అనవసరం...
ఆయన కాలంలో అంతర్జాతీయ విభేదాల పరిష్కారానికి గాంధీజీ అవలంబించిన పద్ధతులు ప్రస్తుత కాలానికి సరిపోతాయి. “ఎలాంటి వివాదాన్ని అయినా పరిష్కరించేందుకు తొలుత మనం చేయాల్సిన పని.. సహనంతో, స్నేహపూర్వక వాతావరణంలో ప్రయత్నాలు చేయాలి. లేదంటే.. ఇద్దరి మధ్య విభేదాల పరిష్కారం మూడో వ్యక్తి నిర్ణయంపై ఆధారపడేలా చేస్తుంది. సహనంతో ఉంటే... మూడోపక్షం జోక్యాన్ని నివారించవచ్చు. ”
సహనంతో ఉంటే... సామాజిక, జాతి, మత, రాజకీయ అంశాల ఆధారంగా విభేదాలు పరిష్కరించవచ్చని గాంధీజీ బలంగా నమ్మేవారు. సహనం నశిస్తున్నప్పుడే.. శాంతి ప్రమాదంలో పడుతుంది. విభేదాలకు అసలు కారణాన్ని గుర్తించాలి. అప్పుడే విభేదాల్లో అస్పష్టంగా ఉన్న సరైన లక్షణం కనిపిస్తుంది. అప్పుడే గాయానికి ఏ ఔషధం వాడాలో తెలుస్తుంది.
గాంధీజీ జీవించిన కాలానికి.. ఇప్పటికీ చాలా అంశాల్లో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ముఖ్యంగా శాంతి విషయంలో.. అప్పుడు, ఇప్పుడు ప్రభుత్వాలు ఒకే తీరుగా ప్రవర్తిస్తున్నాయి. దేశంలో అంతర్గతంగా నెలకొంటున్న అశాంతిని రూపుమాపేందుకు ఆయా ప్రభుత్వాలు అనుసరించే విధానాలను గాంధీజీ తప్పుపట్టారు. ప్రజలపై ఉక్కుపాదం మోపే పౌర ప్రభుత్వ తీరును హింద్ స్వరాజ్‌కి రాసిన వ్యాసంలో బాపూజీ నిరసించారు. తమ దేశంలో ప్రశాంతంగా ఉండటం కోసం.. సరిహద్దు దేశాలతో నిరంతరం ఘర్షణపడటం.. అత్యున్నత ప్రజాస్వామ్య పౌర ప్రభుత్వానికి తగదని గాంధీ హితవు పలికారు.
శాంతియుతంగా ప్రయత్నిస్తున్నారా...?
ఘర్షణలు, తుపాకుల శబ్దాలతో శాంతి నెలకొనదు. కానీ.. అసమానతలు ఎదుర్కొంటున్న నిరాయుధ దేశాలకు న్యాయం చేయాలి. అహింసాయుత పద్ధతిలో శాంతిని నెలకొల్పేందుకు ఇదొక అవకాశం. దురదృష్టవశాత్తు... విభేదాలు వచ్చినప్పుడు శాంతి నెలకొల్పేందుకు చాలా తక్కువ దేశాలే ఇలాంటి విధానాలను పాటిస్తున్నాయి. అలాంటి దేశాలు.. ముల్లును ముల్లుతోనే తీయాలనే బలమైన దేశం ముందు లొంగిపోక తప్పదు.
ఈ రోజుల్లో.. దాయాది దేశాల మధ్య సంఘర్షణలు, స్పర్ధలు ఊహించని స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. శాంతి, అహింస పాటిస్తూ.. పరస్పర నమ్మకంతో.. ఘర్షణల పరిష్కారానికి చర్చలు జరపాలనే ఉదాత్తమైన ఆదర్శాలను ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయా... అంటే లేదనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తాయి.