ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌పై తీవ్ర విమర్శలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతు తెలిపే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి రావటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.
ఈ నెల 15న నిర్వహించే సమావేశానికి తాను హాజరుకాలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు దీదీ.
"నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థికపరమైన, రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతు తెలిపే అధికారాలు లేవనేది వాస్తవం. ఎలాంటి ఆర్థికపరమైన అధికారాలు లేని సంస్థ సమావేశానికి హాజరవటం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
సహకార సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేందుకు అంతర్ రాష్ట్రాల మండలి-ఐఎస్సీపై దృష్టి పెట్టాలని సూచించారు మమత. జాతీయ అభివృద్ధి మండలిని... ఐఎస్సీ కిందకు తీసుకురావాలని పేర్కొన్నారు మమత.