అభిరుచులు, అలవాట్లు అమూల్యమైనవి. అవి కొందరిలో భిన్నంగా ఉంటాయి. వారి ఇష్టాల కోసం ప్రత్యేకంగా రోజులో కొంత సమయాన్ని వెచ్చిస్తారు. అవసరమైతే దాని కోసం ఎంత డబ్బు ఖర్చయిన వెనుకాడరు. అటువంటివారే ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాకు చెందిన రామ్‌సింగ్ అగర్వాల్. ఇంతకీ ఆయన ఏం చేశారో చెప్పలేదు కదా... మొగలుల యుగం నుంచి ప్రస్తుతం స్వతంత్ర భారత్ జారీ చేసిన చివరి నాణెం వరకు సేకరించారు. ఇందుకోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రామ్‌సింగ్ తెలిపారు.
దీనంతటికి ఓ బ్యాంకు మేనేజరే స్ఫూర్తి అని రామ్ సింగ్ చెప్పారు. కోర్బాలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా ఉన్న సమయం(1970)లో తాను.. యూసీఓ బ్యాంకును సందర్శించగా.. నాణేల సేకరణ కోసం అప్పటి బ్యాంకు మేనేజర్ చెప్పినట్లు రామ్ సింగ్ తెలిపారు.
1974లో ప్రారంభం
రామ్‌సింగ్ వద్ద మొగలుల యుగం నుంచి భారత్ ప్రభుత్వం జారీ చేసిన రూ.1000 నాణెం వరకు అన్నీ ఉన్నాయి. రామ్‌సింగ్ తన అభిరుచిని నెరవేర్చడానికి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా వారసత్వ నాణేలను ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. తొలిసారి 1974లో ఓ నాణేన్ని ఆర్డర్ చేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి కాలంతో పాటు ఆయన అభిరుచి పెరుగుతూ వచ్చింది.