అరుదైన 'డీజింగ్' అలవాటుతో దాదాపు 253 విదేశీ రేడియో ప్రసారాలను వింటున్నారు బంగాల్, ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన ఓ పెద్దాయన.
ఉత్తర 24 పరాగణాలు, సుబర్ణపట్టణ్ ప్రాంతానికి చెందిన బాబుల్ గుప్తా (64)కు డీజింగ్ అలవాటుంది. అంటే, సుదూర రేడియో, టీవీ ప్రత్యక్ష ప్రసారాలను ఎలాగైనా వినాలని తపించే అలవాటన్నమాట. ఇందుకోసం ఓ గదిని మినీ రేడియో స్టేషన్గా మార్చేశారు. మేడ మీద బోలెడు యాంటీనాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వింత అలవాటుతోనే ప్రపంచంలోని దాదాపు 253 రేడియో స్టేషన్ల తరంగాలను వెతికిపట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అంటార్కిటికా రేడియో ఛానల్ సైతం బాబుల్ యాంటీనాకు చిక్కింది.
ఎలా అలవాటైందంటే...
ఎక్కడో విదేశాల్లో ప్రసారమయ్యే రేడియో కార్యక్రమాలను వినాలనే తపన తమకు ఎందుకు కలిగిందని అడిగితే... 1968లో తనకు ఎదురైన ఓ సంఘటనను ఈటీవీ భారత్తో పంచుకున్నారు బాబుల్.
"నాకప్పుడు 12 ఏళ్లు. ఓ రోజు వార్తా పత్రిక చదువుతున్నప్పుడు.. మెల్బోర్న్ ఒలంపిక్ క్రీడా కార్యక్రమం ఆ దేశ రేడియో బ్రాడ్ కాస్ట్ లో ప్రసారమవుతుందనే వార్త చూశాను. ఆ రోజు మా నాన్న రేడియో పట్టకుుని ఆ కార్యక్రమం వినాలని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ, పత్రికలో వచ్చిన ఆ ఛానల్ సిగ్నల్ అందలో దొరకలేదు. యాంటీనాలను మార్చి సిగ్నల్ కోసం బాగా ప్రయత్నించాను. చివరికి.. మెల్బోర్న్ రేడియో స్టేషన్ సిగ్నల్ అందింది. అప్పటి నుంచి, వివిధ దేశాల రేడియో తరంగాలను వెతుక్కుంటూ వినేవాడిని."
-బాబుల్ గుప్తా