సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. వీటితో పాటు జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని కుల్గాం అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఓటింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. భద్రతా కారణాల దృష్ట్యా అనంత్‌నాగ్‌కు 3 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది.
71 స్థానాల్లో 12.73కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం లక్షా 37వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఈసీ. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
71 నియోజకవర్గాల నుంచి 943 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 98మంది మహిళలు.
కట్టుదిట్టమైన భద్రత
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించింది. 2 లక్షల 70 వేల మంది పారామిలటరీ బలగాలు, 20 లక్షల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు, హోంగార్డులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎన్నికల సంఘం కోరిన మేరకు 2710 కంపెనీల పారామిలటరీ బలగాలను లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పంపినట్లు వివరించింది. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరా నిఘాను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.