తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘర్షణలో అమరులైన జవాన్ల మృతదేహాలు తరలింపు - china india

china border
సరిహద్దు ఘర్షణలో పాల్గొన్న నలుగురు సైనికుల పరిస్థితి విషమం

By

Published : Jun 17, 2020, 10:06 AM IST

Updated : Jun 17, 2020, 3:39 PM IST

14:25 June 17

గాల్వన్ వ్యాలీ నుంచి అమరుల తరలింపు

గాల్వన్ వ్యాలీలో అమరులైన జవాన్ల మృతదేహాలను లేహ్​లోని సైనిక ఆస్పత్రికి హెలికాఫ్టర్​ ద్వారా  తరలిస్తున్నారు.

13:32 June 17

సరిహద్దు ఘర్షణపై 19న అఖిలపక్షం

భారత్- చైనా సరిహద్దు ఘర్షణపై ఈ నెల 19న సాయంత్రం 5గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వివిధ రాజకీయపార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. చైనాతో సరిహద్దులో వ్యవహరించాల్సిన విధానంపై చర్చించనున్నారు.

13:17 June 17

గాల్వన్ వ్యాలీపై చైనా దురుద్దేశ వ్యాఖ్యలు

గాల్వన్​ లోయపై దురుద్దేశ పూర్వక వ్యాఖ్యలు చేసింది  చైనా. గాల్వన్ వ్యాలీ భూభాగంపై సార్వభౌమాధికారం తమదేనని ప్రకటించింది. భారత సైన్యం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందని చెప్పింది. తమ సైన్యాన్ని అదుపులో పెట్టుకోవాలని భారత్​ను కోరుతున్నామని.. సరిహద్దుపై వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. చైనా భూభాగంలోనే ఘర్షణ జరిగిందని.. ఇందుకు తమను బాధ్యులను చేయొద్దని బుకాయించింది. దౌత్య, సైన్యాధికారుల స్థాయిలో భారత్​తో మాట్లాడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ప్రకటన విడుదల చేశారు.

12:52 June 17

చైనా ఎంబసీ ముందు ధర్నా..

సరిహద్దు ఘర్షణలో భారత సైనికుల మృతిపై దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ముందు ధర్నా చేశారు స్వదేశీ జాగరణ్ మంచ్ సభ్యులు, మాజీ సైనిక అధికారులు ధర్నా చేశారు. ఆందోళనలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు దిల్లీ పోలీసులు. 

12:27 June 17

సైనికుల మృతి కలచివేసింది: రాజ్​నాథ్

"గాల్వన్ లోయ సరిహద్దు ఘర్షణలో భారత సైనికుల ప్రాణాలు పోవడం కలచివేసింది. వారు భారత్​ కోసం ఎంతో ధైర్యసాహసాలు చూపారు. శత్రువుకు వెన్ను చూపని భారత సైన్యం సంప్రదాయాన్ని నిలబెట్టారు. వారి పరాక్రమాన్ని దేశం ఎన్నటికీ మరచిపోదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి." అని అన్నారు రాజ్​నాథ్​.

12:00 June 17

'చర్చల ద్వారానే పరిష్కారం'

భారత్​, చైనా సరిహద్దు అంశమై స్పందించింది బ్రిటన్. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది. హింస ఎవరికీ ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఈ మేరకు బ్రిటన్ హైకమిషన్ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు.

11:11 June 17

రాజ్​నాథ్ అత్యవసర సమావేశం

త్రిదళాధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులతో భారత్- చైనా సరిహద్దు ఘర్షణపై సమావేశమయ్యారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ కూడా హాజరయ్యారు. ఘర్షణల నేపథ్యంలో చైనాతో తదుపరి వ్యవహరించే విధానంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

11:08 June 17

సరిహద్దు ఘర్షణలో చైనా కమాండింగ్ అధికారి మృతి

సోమవారం నాటి సరిహద్దు ఘర్షణలో చైనాకు చెందిన కమాండింగ్ అధికారి మృతి చెందారని సమాచారం. తూర్పు లద్దాఖ్​​లో సోమవారం సాయంత్రం జరిగిన సైనికుల ఘర్షణలో 40 మంది వరకు చైనా జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది.

10:56 June 17

సరిహద్దు ఘర్షణలో 40మంది చైనా జవాన్లు మృతి!

తూర్పు లద్దాఖ్​​లో సోమవారం సాయంత్రం జరిగిన సైనికుల ఘర్షణలో 40 మంది  చైనా జవాన్లు మృతి చెందారని సమాచారం. ఘటనా స్థలం నుంచి స్ట్రెచర్లు, అంబులెన్స్​ల తరలింపు.. చైనా హెలికాఫ్టర్లు పలుసార్లు చక్కర్లు కొట్టిన సంఖ్య ఆధారంగా 40మంది మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

10:21 June 17

చైనా తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు

సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతి చెందడంపై దేశవ్యాప్తంగా సాధారణ ప్రజానీకం సంఘీభావం తెలుపుతోంది. చైనా తీరుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్ వారణాసి, గుజరాత్​ అహ్మదాబాద్​లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ దేశంలో తయారయిన వస్తువులను తగలబెట్టారు.

10:12 June 17

'35మంది మృతి చెంది ఉండొచ్చు'  

భారత్​- చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణపై కీలక ప్రకటన చేసింది అమెరికా నిఘా విభాగం. ఈ ఘటనలో చైనాకు చెందిన 35 మంది జవాన్లు మృతి చెంది ఉండొచ్చని అంచనా వేసింది.

10:09 June 17

ప్రధాని మౌనమెందుకు?

చైనాతో సరిహద్దు ఘర్షణలో 20మంది సైనికుల మృతి, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఈ అంశమై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. 'ఇప్పటికే చాలా జరిగింది. ఏం జరిగిందో అందరికీ తెలియాలి. మన సైనికులను చంపడంలో చైనాకు ఎన్ని గుండెలు. మన భూభాగాన్ని ఆక్రమించేందుకు వారికి ఎంతధైర్యం' అని వ్యాఖ్యానించారు.

09:53 June 17

సరిహద్దు ఘర్షణలో నలుగురు భారత సైనికుల పరిస్థితి విషమం

చైనా సైన్యంతో తూర్పు లద్దాక్ వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన నలుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది సైనికులు అమరులయ్యారు.

Last Updated : Jun 17, 2020, 3:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details