ప్రజాస్వామ్య భారత ప్రస్థానంలో తనకు ముందు - తన తర్వాత అన్నంత స్థాయిలో దేశ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన తెలుగు ఠీవీ.. పీవీ. పాములపర్తి వెంకటనరసింహారావు. రాజకీయ దురంధరుడే కాదు. దాదాపు 17 భాషలపై పట్టున్న బహుభాషా కోవిదుడు. గొప్ప పండితుడు. వైకుంఠపాళి, కత్తిమీద సాములాంటి మైనార్టీ ప్రభుత్వాన్ని నిండు అయిదేళ్లు అధికారంలో కొనసాగించిన చాణక్యుడు. ఒక వ్యక్తిలో ఇన్ని బహుముఖ పార్శ్వాలు ఉండడం అసాధారణం. అందుకే ఆయన తెలుగుజాతి అనర్ఘరత్నంగా మన్ననలు అందుకుంటున్నారు.
భారత యవనికపై చెరిగిపోని సంతకం 'పీవీ' - pv narasimha rao jayanthi
చరిత్రలో కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగి ఆరిపోయేవాళ్లు కొందరు! జీవించి ఉన్నా, లేకున్నా శాశ్వతంగా చరిత్రలో నిలిచి తరతరాలకు తమ వైభవదీప్తులు వెదజల్లే వారు, మార్గ నిర్దేశం చేసేవారు ఇంకొందరు. రెండవ కోవలోనే ప్రముఖంగా కనిపిస్తారు.. తెలుగుఠీవీ.. మాజీ ప్రధాని దివంగత పీవీ. భారత యవనికపై చెరిగిపోని సంతకం ఆయనది. ఆ అనితర సాధ్యుడి శతజయంతి ఉత్సవాల వేళ యావత్ దేశం ఆయనను ఘనంగా స్మరించుకుంటోంది.
ఈ దేశానికి, ప్రజలకు పీవీ అమూల్యమైన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఆరడుగుల ఆజానుబాహుడు కాదు. భారీకాయం ఉన్న మల్లయోధుడు కాదు. కానీ.. కేవలం తన మేధస్సుతో, ప్రతిభాపాటవంతో, బహుభాషా పాండిత్యంతో, అద్వితీయమైన రాజకీయ చాణక్యంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే సంతకం చేశారు. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ప్రపంచ దేశాల అధినేతలు ఎందరో ఆయనను ఆచార్యుడిగా, గురువుగా, మార్గదర్శకుడిగా గౌరవించారు. గుర్తుంచుకున్నారు.
తనకు ముందున్న ప్రభుత్వాల ఏలుబడిలో చితికి శిథిలమైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి దివాళ అంచుల నిలిచిన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రధానిగా వీపీ చేపట్టిన తొలి కార్యక్రమం... ఆర్థిక సంస్కరణ. ఈ దేశంలో, పొరుగు దేశాల్లో తలపండిన ఆర్థిక వేత్తలు, నిపుణులు, నాడు పీవీ చేపట్టిన సంస్కరణలను ప్రశంసించారు. నేటికీ ప్రశంసిస్తునే ఉన్నారు. ఆధునిక భారత చరిత్ర ఉన్నంత కాలం ఆ స్ఫూర్తి స్మరణకు వస్తూనే ఉంటుంది. అందుకే దేశం అంతా ఆయనకు శతజయంత్యుత్సవాల వేళ సరిలేరు మీకెవ్వరూ అంటూ నివాళులు అర్పిస్తోంది.