తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2019, 9:41 AM IST

ETV Bharat / bharat

'నాగా'ల సమస్యకు పరిష్కారం దిశగా కేంద్రం!

ఏడు దశాబ్దాలకుపైగా నలుగుతున్న ‘నాగా’ల సమస్య పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయా..? కేంద్రం-నాగా వేర్పాటువాద వర్గాల మధ్య చర్చలు సానుకూల ఫలితాలిచ్చాయా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉభయపక్షాల మధ్య ఒప్పందం కార్యరూపం దాలిస్తే ఈశాన్య భారతం కొంత అయినా కుదుటపడుతుంది. అక్కడ శాంతి పవనాలు వీస్తాయి.

శాంతి బాటలో కొలిక్కి వస్తున్న నాగాల చర్చ

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వాయువ్య భారతంలో కశ్మీర్‌, ఈశాన్య భారతంలో ‘నాగా’ సమస్యలు రగులుతూనే ఉన్నాయి. తొలి ప్రధాని జవహార్​లాల్ నెహ్రూ నుంచి నేటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరకు ప్రభుత్వాలన్నీ ఈ సమస్యపై చర్చలు జరుపుతూ వచ్చాయి. నాగా అంశంపై గతంలో పలుమార్లు సాగిన చర్చల వల్ల ఫలితం లేకపోయింది. లండన్‌, పారిస్‌, ఒసాకా, బ్యాంకాక్‌ నగరాలు వేదికగా నాగా నాయకులతో జరిగిన శాంతి చర్చలు అర్ధాంతరంగానే ముగిశాయి.

వ్యూహాత్మకంగా అడుగులు

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక మళ్ళీ చర్చల ప్రక్రియ మొదలైంది. 2015 ఆగస్టులో ప్రధాన వేర్పాటు సంస్థ అయిన నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌- ఐఎమ్‌) వర్గంతో కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే పూర్తి ఒప్పందం చేసుకుంటామని అప్పట్లో ప్రకటించింది. మరో వేర్పాటు సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్‌ (కప్లాంగ్‌) వర్గం సైతం 2017లో తాత్కాలిక ఒప్పందాన్ని చేసుకుంది. త్వరలో పూర్తవుతాయనుకున్న చర్చలు పలుమార్లు జరిగాయి. రెండు ప్రధాన వేర్పాటు సంస్థల్లోనూ ఈ మధ్యకాలంలో చీలికలు వచ్చాయి. ఈ రెండు వర్గాలతో విసిగిన మిగతా సంస్థలు నాగా జాతీయ రాజకీయ వర్గంగా ఏర్పడ్డాయి. మొదట్లో ఆరు వర్గాలుగా ఉన్న ఈ సంస్థ కప్లాంగ్‌ సంస్థ నుంచి చీలిన వర్గంతో కలిసి ఏడు సంస్థలుగా విడిపోయి బలపడ్డాయి. చివరికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌.రవితో ఈ సంస్థ చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయి. ఒప్పందంపై సంతకం చేయబోయే సంస్థల్లో ఇది కూడా ప్రధానపాత్ర పోషిస్తుంది. ఓ విధంగా ఇది ఐఎమ్‌ వర్గం మీద ఒత్తిడి పెంచింది.

ఈ పరిస్థితులను గమనించిన కేంద్రం సమస్య పరిష్కారానికి అక్టోబరు 31వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా గడువులోగా చర్చలు ముగించి ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. దాంతో వేర్పాటువాద సంస్థలపై ఒత్తిడి పెరిగింది. చర్చల సంధానకర్తగా రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌.రవిని ప్రభుత్వం నియమించింది. ఆయనకు సమస్యపై స్పష్టమైన అవగాహన ఉంది.

కేంద్రం నిర్ణయం నాగా సమాజంపై ప్రభావం చూపింది. ఇటీవలే నాగా పౌరసంస్థలు, చర్చి ప్రతినిధులు, ఇతర శాంతి సంస్థలతో కలిసి సమావేశం ఏర్పాటుచేశారు. చర్చలకు సంబంధించి వారిని ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకుంది. వివిధ వర్గాలతో చర్చలు పూర్తయ్యాయి. చివరకు తుది గడువు లోపల అంగీకారానికి రావడం కోసం గత వారం రోజుల నుంచి దిల్లీలో విస్తృతంగా చర్చించారు. ప్రధాన వేర్పాటువాద సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎమ్‌) వర్గం నాయకుడు మూవాను చర్చలకు ఒప్పించడంలో సఫలమైంది.

చర్చల్లో కొరకరాని కొయ్యలాగా మారిన నాగా ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగంపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. జెండా విషయంలో ఉభయపక్షాలూ ఓ మెట్టు దిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నాగా జెండాను ఉపయోగించరు. కానీ నాగాల సాంస్కృతిక కార్యకలాపాలకు మాత్రం జెండాను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక రాజ్యాంగంపై ప్రస్తుతానికి వేర్పాటువాద సంస్థలు పట్టుపట్టడం లేదు. దీంతో చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒప్పందంలో ఏముందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోపక్క నాగాలాండ్‌ పొరుగు రాష్ట్రం మణిపుర్‌లో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. నాగాలాండ్‌ తరవాత నాగాలు ఎక్కువగా నివసించేది ఈ రాష్ట్రంలోనే. ఒప్పందం వల్ల తమ భూభాగం నాగాలాండ్‌కు కోల్పోవాల్సి వస్తుందని మణిపుర్‌ ఆందోళన చెందుతోంది. ఈ వాదనను విశ్వసించవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరించింది. భాగస్వామ్య పక్షాలైన మిగతా రాష్ట్రాలతో మాట్లాడకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ప్రకటించింది. ఒప్పందానికి సంబంధించి కొంత సమాచారం తెలియవచ్చింది. మణిపుర్‌, నాగాలాండ్‌, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఎటువంటి మార్పులుండవు. మిగతా మూడు రాష్ట్రాల్లో నాగాలు మెజారిటీగా ఉన్న ప్రాంతాలు స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలుగానో, కౌన్సిళ్ళుగానో ఉంటాయి. ఈ ప్రాంతాల్లోని నాగాల ఆచార వ్యవహారాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు. నాగాలాండ్‌తో పాటు మిగతా నాగా మెజారిటీ ప్రాంతాల్లో ఓ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యకలాపాలు సాగుతాయి. నాగా ప్రాంతాలకు ప్రత్యేక విద్యా సంస్థలు, అభివృద్ధి పనులను మంజూరు చేసే అవకాశముంది. నాగా నిషిద్ధ సైన్యాన్ని భారత సైన్యంలోకి గాని, ఇతర పారామిలిటరీ బలగాల్లోకి గాని తీసుకుంటారు.

ఒప్పందంలో ఇవి ప్రధాన అంశాలుగా చెబుతున్నారు. వీటిపై మిగతా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, ఒప్పించిన తరవాతే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. సరిహద్దుల్లో మార్పులు చేయనంతవరకు మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించకపోవచ్చు. అయితే వేర్పాటువాద సంస్థ నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎమ్‌) మరో వాదన వినిపిస్తోంది. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించకపోతే ఆయుధాలు అప్పగించేది లేదని ఈ సంస్థ అగ్రనేత ఒకరు వెల్లడించారు. ఈ వర్గం వద్ద ఏకే-47, మోర్టార్లు, రాకెట్‌ లాంచర్లు ఉన్నాయి. మొత్తం అయిదువేల ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. వీటిని వివిధ దేశాల నుంచి సమకూర్చుకున్నారు.

ఒప్పందమే తరువాయి

కేంద్రం, వేర్పాటువాద సంస్థల మధ్య చర్చలతో సమస్య పరిష్కారమైనట్లేనా అన్న ప్రశ్నకు దాదాపుగా అవుననే సమాధానం వస్తోంది. వేర్పాటువాద సంస్థల్లో ఎక్కువభాగం చర్చల్లో భాగస్వాములయ్యాయి. పొరుగు దేశమైన మయన్మార్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఓ సంస్థ తప్ప మిగతా వాటిని ఒకతాటి మీదకు తీసుకువచ్చారు. ఇది సాధారణ విషయం కాదు. 13వ రాజ్యాంగ సవరణ ద్వారా నాగాల ప్రత్యేక సంస్కృతి పరిరక్షణకు కేంద్రం కట్టుబడింది.

ఆ హక్కుల్ని ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లోని నాగా మెజారిటీ ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో నాగాలకు ప్రత్యేక జిల్లాలు న్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో నాగాలు ‘గ్రేటర్‌ నాగాలిం’ కోసం పట్టుబట్టే అవకాశాలు లేవు. ఈ డిమాండును వదులుకునేటట్లు ఒప్పించడం ప్రభుత్వపరంగా విజయమే!

ప్రపంచంలోనే సమర్థమైన సైన్యాల్లో ఒకటిగా భారత్‌ సైన్యం రూపుదిద్దుకోవడం నాగాల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది. ఈశాన్య భారతంలో ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, మయన్మార్‌ పూర్తిగా భారత్‌తో సమన్వయంతో పనిచేయడమూ వారి ఆలోచనలను ప్రభావితం చేసింది. ఏడు దశాబ్దాల కాలంలో నాగా సమాజంలో గణనీయ మార్పు వచ్చింది. అక్షరాస్యత పెరిగింది. స్వాతంత్య్రం పేరుతో ఇంకా పోరాడే పరిస్థితి లేదు.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. నాగా యువత ఆలోచనల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఉద్యమాల వల్ల ఉపయోగం లేదన్న భావన బలపడుతోంది. అందువల్లే ఒప్పందానికి సానుకూలంగా అడుగులు పడుతున్నాయన్న భావన ఈశాన్య భారతంలో నెలకొంది!

ఇదీ చూడండి : పట్టాలపై పహారా కాస్తున్న ముంబయి 'యముడు'

ABOUT THE AUTHOR

...view details