కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ సదరు లేఖలో పేర్కొంది.
"ఇద్దరు ప్రధానులను దేశం తీవ్రవాదుల దాడి వల్ల కోల్పోయింది. ఆ ఇద్దరు గాంధీ కుటుంబానికి చెందినవారే. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా అలాంటి దాడి జరుగుతుందనే అనుమానం ఉంది. అమేఠీ లోక్సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశాక రాహుల్ విలేకరులతో మాట్లాడారు.
ఆ సమయంలో స్వల్ప వ్యవధిలో ఆయన ముఖం కుడి భాగంపై 7 సార్లు లేజర్ వెలుగు పడినట్లు గుర్తించాం. మాజీ భద్రతా నిపుణులు, అధికారులను సంప్రదించాక ఆ లేజర్ ఓ శక్తిమంతమైన స్నైపర్ తుపాకీ లాంటి ఆయుధం నుంచి వచ్చినట్లు ప్రాథమిక నిర్ధరణకొచ్చాం. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. దీనిపై హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం."
- కాంగ్రెస్ లేఖ సారాంశం