ఎడతెరిపిలేని వర్షాల మూలంగా దేశంలోని పలురాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తీవ్రంగా నష్టపోయాయి. భారీ వరదల మూలంగా కేరళలో 111, మధ్యప్రదేశ్లో 70, మహారాష్ట్రలో 54, రాజస్థాన్లో ఐదుగురు చనిపోయారు.
రాజస్థాన్లో రెడ్ అలర్ట్
రాజస్థాన్లోని జోధ్పూర్, నాగౌర్, పాలీ జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రమాదం ముంచి ఉన్నందున సహాయక చర్యలకు సైన్యం సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
గురువారం కోట, బరణ్, భిల్వారా, జలావర్లో, బుండి జిల్లాల్లో 160 మి.మీలకుపైగా వర్షం కురిసింది. వరదలు ముంచెత్తడం వల్ల ఐదుగురు మరణించారు.
కేరళ అతలాకుతలం
కేరళ వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 111కు చేరుకుంది. 31 మంది ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా 1.47 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.