దేశ వ్యాప్తంగా వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ మృతులసంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేరళలో 91, మహారాష్ట్రలో 43, కర్ణాటకలో 48, గుజరాత్లో 31 మంది భారీ వర్షాలు, వరదలకు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మొత్తంగా కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు దాదాపు 225 మంది మృత్యువాత పడ్డారు.
కేరళకు మళ్లీ వర్షం ముప్పు!
ఈ నెల 8 నుంచి కురిసిన భారీ వర్షాలకు కేరళలో వరదలు పోటెత్తాయి. ఇప్పటికీ 2 లక్షల 52 వేల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. కేరళలో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికతో కేరళ ప్రభుత్వం మరోమారు అప్రమత్తమైంది.
మహారాష్ట్రలో సాధారణ పరిస్థితులు
మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు సంగ్లి, కోల్హాపుర్ , సతారా, పుణె, సోలాపుర్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. దాదాపు వారం రోజులపాటు జనజీవనం స్తంభించింది. 584 గ్రామాల్లోని దాదాపు 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా ఆయన మంత్రివర్గం ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు.
కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి యడియూరప్ప వరదలతో తీవ్రంగా నష్టపోయిన శివమొగ్గ జిల్లాలో పర్యటించారు. వరదల వల్ల రూ. 50వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రకటించారు.