జలప్రళయంలో చిక్కుకున్న దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు రుతుపవనాల కారణంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు 100కు పైగా మృతిచెందారు. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
అస్తవ్యస్తంగా కేరళ
కేరళను వరదలు అస్తవ్యస్తం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 51 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షా 25 వేల మంది నిరాశ్రయులయ్యారు. వీరి కోసం 1,100 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వరదల ధాటికి వేల ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
మోకాలి లోతులో వరదనీరు నిలిచి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 80 చోట్ల కొండచరియలు విరిగిపడగా శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మలప్పురం జిల్లా కొట్టాక్కున్నులో విరిగిపడి ఉప్పెనలా తన్నుకొస్తున్న కొండచరియల నుంచి ఇద్దరు వ్యక్తులు త్రుటిలో తప్పించుకున్న దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో నమోదయ్యాయి.
రైలు పట్టాలు మునిగిపోయిన కారణంగా పలు రైళ్ల సేవలను రద్దు చేశారు. ఆదివారం మధ్యాహ్నం కొచ్చి విమానాశ్రయంలో సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కర్ణాటకలో వర్షాలు తగ్గినప్పటికీ..
కర్ణాటకలో కుండపోత వర్షాలు కాస్త తగ్గినా.. వరదలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తున్నాయి. సీఎం యడియూరప్ప సహాయ, పునరుద్ధరణ చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వరదల వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం, పునరుద్ధరణ పనుల కోసం రూ.100 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.
తేరుకోని మహారాష్ట్ర..
వరద విలయం నుంచి మహారాష్ట్ర ఇంకా తేరుకోలేదు. వరద నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా.. సంగ్లీ, కొల్హాపుర్ జిల్లాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి తేరుకునేందుకు మరో 2,3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ రెండు జిల్లాలతో పాటు సతారా, పుణె, సోలాపూర్‌లోని అనేక ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఈ జిల్లాల్లో ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
స్తంభించిన గుజరాత్..
భారీ వర్షాలతో గుజరాత్లో జనజీవనం స్తంభించింది. రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల 19 మంది మృతి చెందారు. ఇందులో గోడ కూలిన ఘటనల్లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
సహాయక చర్యలు
అన్ని రాష్ట్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆయా రాష్ట్రాల ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, వాయుసేన, నావికాదళాలు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన బైక్