అసోంలో వరదల బీభత్సం కొనసాగుతునే ఉంది. భారీగా కురుస్తున్న వర్షాల ధాటికి నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఇప్పటివరకు 26 జిల్లాలకు చెందిన 36 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుని మృతిచెందిన వారి సంఖ్య 92కు పెరిగింది. బుధవారం ఒక్కరోజే ఏడుగురు మృత్యువాతపడ్డారు.
దుబ్రి జిల్లా వరదలకు బాగా దెబ్బతింది. ఐదు లక్షల మందికిపైగా నిర్వాసితులయ్యారు. దుబ్రి, ధెమాజీ, లఖీంపుర్, బిశ్వనాథ్, సోనిత్పూర్, దరాంగ్, గోల్‌పారా, కమ్రప్, గోరిఘాట్ మజులి, శివసాగర్, దిబ్రూఘర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లక్షా 28 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది.
ముమ్మరంగా సహాయక చర్యలు
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. అసోంవ్యాప్తంగా 223 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు.