ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి జమ్ముకశ్మీర్‌లో 148 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు రాజకీయ నాయకులను.. సోమవారం విడుదల చేసినట్లు జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం తెలిపింది. వీరంతా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ పార్టీలకు చెందిన వారు. ఎటువంటి ఆందోళనలకు పాల్పడకుండా, సమ్మెలకు పిలుపునివ్వకుండా ఉంటామని హామీ ఇచ్చిన తర్వాతే వారిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
నిర్బంధం నుంచి విడుదలైన వారిలో ఎన్సీపీకి చెందిన ఇష్ఫాక్ జబ్బర్, గులాం నబీభట్, పీడీపీ నాయకులు బషీర్ మీర్సా జహూర్ మీర్, యూసిర్ రేషి ఉన్నారు. పీడీపీకి చెందిన దిలావర్ మీర్, డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్కు చెందిన గులాం హసన్ మీర్‌ను నవంబరు 25న నిర్బంధం నుంచి విడుదల చేసింది అధికార యంత్రాంగం.
భద్రత ఆంక్షల నడుమ
ఆర్టికల్ 370 రద్దుతో పాటు లద్దాఖ్, జమ్ముకశ్మీర్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత.. శాంతి భద్రతల దృష్ట్యా ఆగస్టు 5న కొంతమంది రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇటీవల శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల నిర్బంధంలో ఉన్న 34 మంది రాజకీయ నాయకులను ఎమ్మెల్యే వసతి గృహాలకు తరలించారు. వీరిలో జమ్ము మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు.
మరో 90 రోజులు నిర్బంధం
ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద ఫరూక్ అబ్దుల్లాను సెప్టెంబర్ 17 న కట్టుదిట్టమైన భద్రతతో గృహ నిర్బంధం చేశారు. ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీలను నగరంలోని వేరువేరు ప్రదేశాల్లో నిర్బంధంలో ఉంచారు. ముఫ్తీని ఇటీవల జబెర్వాన్ పర్వతశ్రేణిప్రాంతంలోని పర్యటక ప్రదేశం నుంచి నగరంలోని ప్రభుత్వ వసతి గృహానికి మార్చారు. పీఎస్ఏ దృష్ట్యా ఫరూక్ అబ్దుల్లాను మరో 90 రోజులు నిర్బంధంలో ఉంచాలని నిర్ణయించారు అధికారులు.