ప్రధానిగా మోదీ తొలి నిర్ణయం ఏంటో తెలుసా..? ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోదీ. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలోని మహాత్మా గాంధీ, ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతిమలకు నివాళులర్పించారు. అధికారం చేపట్టాక తొలి నిర్ణయం దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడే సాయుధ దళాల కోసం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు.
తొలి నిర్ణయమిదే...
జాతీయ రక్షణ నిధి కింద నడుస్తున్న ప్రధాన మంత్రి ఉపకార వేతనాల పథకంలో మార్పులు చేశారు మోదీ. బాలురకు ఇచ్చే ఉపకార వేతనాలను నెలకు రూ.2 వేల నుంచి రూ.2 వేల500కు, బాలికలకు రూ.2250 నుంచి రూ.3 వేలకు పెంచారు.
కేంద్ర, పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఉపకార వేతనాల పథకాన్ని రాష్ట్ర పోలీసు విభాగాలకూ విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులు, నక్సలైట్ల దాడిలో అమరులైన రాష్ట్ర పోలీసుల కుటుంబాల పిల్లలకూ ఇప్పటి నుంచి ఈ ఉపకార వేతన పథకం వర్తించనుంది. ఏడాదికి 500 మందిని ఉపకార వేతనాల కోసం రాష్ట్ర పోలీసు విభాగాల నుంచి ఎంపిక చేయనున్నారు.
1962లో ఏర్పాటు
జాతీయ రక్షణ నిధిని 1962లో ఏర్పాటు చేశారు. ఈ నిధికి ndf.gov.in ఆన్లైన్లో మాత్రమే స్వచ్ఛందంగా విరాళాలు అందించే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఏటా రక్షణ శాఖ బలగాల పరిధిలోని 5500 మందికి, పారా మిలటరీ దళాలల్లోని 2 వేల మంది, రైల్వే శాఖ ఆధ్వర్యంలోని దళాల పరిధిలోని 150 మందికి ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి:బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు