భాజపా ఎన్నికల ప్రణాళికలో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని చేర్చడంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. భారత్ నుంచి కశ్మీరీలు స్వాతంత్ర్యం పొందేందుకే భాజపా ఈ నిర్ణయానికి వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు.
ఆర్టికల్ 370ని రద్దుచేస్తే కశ్మీర్లో జాతీయ పతాకాన్ని ఎవరూ ఎగరేయబోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రమని ఎంత ప్రయత్నించినా ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి చెందని బయటి వ్యక్తులు ఆస్తుల్ని కొనడాన్ని నిషేధించే ఆర్టికల్ 35ఏ రద్దు విషయాన్ని భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. దీనిపైనా ఘాటు విమర్శలు చేశారు ఫరూక్.
ఆర్టికల్ 370 రద్దు చేసే దమ్ముందా? :ఫరూక్ "బయటి నుంచి ప్రజల్ని తీసుకువచ్చి మా సంఖ్యను తగ్గిద్దామనుకుంటున్నారా? మేం నిద్రపోతూ ఉంటామనుకుంటున్నారా? మేం ఈ ప్రయత్నంపై పోరాడతాం, దానికి వ్యతిరేకంగా నిలబడతాం. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తారా?. ఇక రాజ్యాంగం ఉంటుందనుకుంటున్నారా? మీ నుంచి స్వాతంత్ర్యం పొందడమే దైవం ఉద్దేశమనుకుంటా. ఆర్టికల్ 370ని రద్దు చేయాలనుకుంటే చేయండి మేమూ చూస్తాం... మద్దతెవరిస్తారో. మా మనస్సుల్ని విరిచేసే పనులు చేయకండి. హృదయాల్ని కలిపే పనులు చేయండి."
-ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత