వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు ఇప్పట్లో ఆగేలా లేవు. రైతు సమస్యల పరిష్కారం కోసం.. దిల్లీ విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చ ఓ కొలిక్కిరాలేదు. రైతు యూనియన్ల ప్రతినిధులు, కేంద్ర ప్రతినిధులు సహా వ్యవసాయ రంగ నిపుణులతో ఉమ్మడి కమిటీ చేయాలన్న కేంద్ర ప్రతిపాదనను దాదాపు 35 సంఘాలకు చెందిన రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.
డిసెంబర్ 3న మరోసారి సమావేశం కానున్నట్లు కేంద్ర ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్, సోమ్ ప్రకాశ్ హాజరయ్యారు.
3 వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి:కర్షక పోరు: ఈ ఐదు ప్రశ్నలకు బదులేది?
భేటీ అనంతరం మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ చర్చలు సానుకూలంగా సాగాయని అన్నారు.
''సమావేశం బాగానే జరిగింది. డిసెంబర్ 3న మరోసారి చర్చలు జరపనున్నాం. మేమొక కమిటీని నియమించాలనుకున్నాం. కానీ రైతు సంఘాలు అందుకు ఒప్పుకోలేదు. అందరి సమక్షంలోనే చర్చలు జరగాలంటున్నారు. దానితో మాకేం సమస్య లేదు.''
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి